హస్తసాముద్రికం అనేది ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలలో ఒకటి. ఇది వ్యక్తి అరచేతి ఆకారం, గీతలు, పర్వతాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. అరచేతిలోని రేఖలు కేవలం వ్యక్తి స్వభావాన్ని మాత్రమే కాకుండా, వారి జీవనశైలి, ఆర్థిక స్థితి, విజయాలు, కీర్తిని కూడా సూచిస్తాయని నమ్మకం ఉంది.
హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన సంకేతాలను చూద్దాం.
సూర్య పర్వతం (Sun Mount)..
ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. ఇది పేరు, కీర్తి, సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెంది ఉబ్బెత్తుగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి పేరు, గౌరవం, ఆర్థిక విజయాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది సపాటుగా ఉండడం లేదా విరిగిన గీతలు ఉండడం వృత్తిలో ఆటంకాలను సూచించవచ్చు.
బుధ పర్వతం (Mercury Mount)..
చిటికెన వేలుకు కింద ఉన్న ప్రాంతాన్ని బుధ పర్వతం అంటారు. ఇది తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సూచిస్తుంది. ఈ పర్వతం స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటే, ఆ వ్యక్తి మంచి వ్యాపార విజయాలు సాధించగలడు. ఆర్థికంగా స్థిరంగా ఉండగలడు. విజయవంతమైన వ్యాపారవేత్తల చేతుల్లో ఈ పర్వతం బలంగా కనిపిస్తుంది.
విధి రేఖ (Fate Line)..
అరచేతి మధ్యలో ఉండే రేఖను విధి రేఖ అంటారు. ఇది సాధారణంగా మణికట్టు నుండి ప్రారంభమై మధ్య వేలు కింద ఉన్న శని పర్వతం వరకు కొనసాగుతుంది. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా, విరామాలు లేకుండా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో స్థిరమైన విజయం, అదృష్టం కలుగుతుందని భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ కష్టాలతోనే పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)




