అయ్యో రేణుక.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి కళకళలాడాల్సిన ఇంట్లో పెను విషాదం!

అయ్యో రేణుక.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి కళకళలాడాల్సిన ఇంట్లో పెను విషాదం!


అయ్యో రేణుక.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి కళకళలాడాల్సిన ఇంట్లో పెను విషాదం!

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. అప్పటివరకు నవ్వుతూ, అందరితో సరదాగా గడిపిన ఓ యువతి, జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేలోపే విధి వంచనకు గురవ్వడం స్థానికులను కలచివేస్తోంది. ఒకవైపు పెళ్లి బాజాల సందడి మొదలవ్వాల్సిన ఇల్లు.. మరోవైపు కొత్త జీవితంపై వేల ఆశలతో ఊపిరి పోసుకున్న కలలు.. కానీ, ఆ కుటుంబం రాసుకున్న సంతోషాల రాతను కాలం ఒక్క క్షణంలో చెరిపివేసింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామం ఇప్పుడు కన్నీటి సంద్రమైంది.

బోనెల శ్రీను, వరలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రేణుక (18). నిరుపేద కుటుంబం అయినప్పటికీ, రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూడా రేణుక ధైర్యంగా నిలబడింది. విజయనగరంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకునేది. ఇటీవలే ఆమెకు వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కి, కొత్త ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన రేణుక, ఆ ఇంట్లో వెలుగులు నింపుతుందని అందరూ ఆశించారు.

ఆదివారం (ఏప్రిల్ 19) కావడంతో షాపు ప్రచారం కోసం యాజమాన్యం సూచన మేరకు సిబ్బందితో కలిసి ఆటోలో బయలుదేరింది రేణుక. సిరిపురం, మురపాక, పెదవేమలి గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా గడిపింది. పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన వేళ, తన సొంత ఊరు నరవ శివారులోని హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఊహించని ప్రమాదం జరిగింది. ఆటోలో నుంచి ప్రమాదవశాత్తూ రేణుక జారి కింద పడిపోయింది. దురదృష్టవశాత్తూ తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. తోటి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునే లోపే ఆమె కన్నుమూసింది.

పెళ్లి పత్రికలు పంచి, బంధువులను పిలవాల్సిన సమయంలో.. కూతురి పార్థివ దేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. “అమ్మా.. వెళ్లొస్తా” అని చెప్పి వెళ్లిన బిడ్డ, శవమై తిరిగిరావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు పెళ్లి కొడుకు కుటుంబం కూడా ఈ వార్త విని దిగ్భ్రాంతికి లోనైంది. రేణుక అందరితో కలివిడిగా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆ అమ్మాయి ఇలా అకాల మరణంతో స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబంలో పెళ్లి సందడి ఉండాల్సిన చోట, చావు మేళం వినిపించడం అందరినీ కలచివేస్తోంది. రేణుక మరణం కేవలం ఒక కుటుంబానికే కాదు, ఆ గ్రామానికే ఒక తీరని వేదన మిగిల్చింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *