సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి ఇన్సూరెన్స్ కంపెనీలను ముంచాలనుకున్న ముగ్గురు వ్యక్తుల ఆట కాలిఫోర్నియాలో ముగిసింది. ఎలుగుబంటి దాడి చేసినట్లుగా నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు కాజేయాలని చూసిన ఈ కేటుగాళ్లకు కోర్టు తగిన శిక్ష విధించింది. నిందితులు తమ వద్ద ఉన్న లగ్జరీ కార్ల లోపల భారీగా నష్టం జరిగిందని, ఒక ఎలుగుబంటి కారులోకి దూరి తన గోళ్లతో ఇంటీరియర్‌ను చిందరవందర చేసిందని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా ఒక సీసీటీవీ ఫుటేజీని కూడా సమర్పించారు. ఆ వీడియోలో ఒక ఎలుగుబంటి లాంటి ఆకారం కారులోకి ప్రవేశించడం స్పష్టంగా కనిపించింది.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ వీడియోపై అనుమానం రావడంతో దర్యాప్తు అధికారులను ఆశ్రయించారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ నిపుణులు ఆ వీడియోను నిశితంగా పరిశీలించగా, ఆ ఎలుగుబంటి కదలికలు జంతువులా లేవని, మనిషిలా ఉన్నాయని గుర్తించారు. ముఖ్యంగా ఎలుగుబంటి గోళ్ల గుర్తులు (Claw marks) సహజంగా లేవని తేల్చారు.
అధికారులు ఆపరేషన్ బేర్ క్లా పేరుతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా, నేరానికి ఉపయోగించిన ఎలుగుబంటి కాస్ట్యూమ్, మాంసం కోసేందుకు వాడే పరికరాలు లభించాయి. దీంతో నిందితులు తమ తప్పును ఒప్పుకోక తప్పలేదు. సుమారు రూ.1.2 కోట్ల రూపాయల క్లెయిమ్ పొందడానికి ఈ ముఠా ప్రయత్నించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసును విచారించిన కోర్టు, నిందితులకు 180 రోజుల జైలు శిక్షతో పాటు రెండేళ్ల ప్రొబేషన్ విధించింది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలకు జరిగిన నష్టానికి గానూ భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన అంతర్జాతీయ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
సాంకేతికతను ఉపయోగించి ఎన్ని వేషాలు వేసినా, నిపుణుల పరిశీలనలో దొరికిపోక తప్పదని ఈ కేసు నిరూపించింది. ఇన్సూరెన్స్ మోసాల పట్ల అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఈ ఆపరేషన్ బేర్ క్లా స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…