RSS Chief Mohan Bhagwat: సంస్కృతం భారత దేశపు ఆత్మ అని, దేశాన్ని, దాని మూలాలను అర్థం చేసుకోవాలంటే సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో సంస్కృత భారతికి చెందిన అంతర్జాతీయ శిక్షణ కేంద్రం, నూతన కార్యాలయం “ప్రణవ్” ప్రారంభోత్సవ కార్యక్రమం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వైభవంగా జరిగింది.
ఈ నూతన కార్యాలయం కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా ఒక అంతర్జాతీయ శిక్షణ కేంద్రంగా పనిచేస్తుందని మోహన్ భాగవత్ తెలిపారు. ఇక్కడి నుండి అంతర్జాతీయ సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా, భారతీయ జ్ఞాన సంప్రదాయంలోని వివిధ అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.
భారతదేశం అంటే కేవలం భూభాగం కాదు:
“భారతదేశం అంటే కేవలం ఒక రాజకీయ భౌగోళిక ప్రాంతం కాదు. భారతదేశాన్ని దాని సంపూర్ణత్వంతో అర్థం చేసుకోవాలంటే సంస్కృతం తెలియాలి. సంస్కృతం దేశంలోని వివిధ భాషలను కలిపే ఒక వారధి,” అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
సంభాషణే సరైన మార్గం:
సంస్కృతం నేర్చుకోవడానికి ‘సంభాషణ’ (Sanskrit Conversation) అత్యంత సరైన, సులభమైన మార్గమని భాగవత్ సూచించారు. గడచిన 15 ఏళ్లలో దేశంలో సంస్కృతం పట్ల ఆసక్తి పెరిగిందని, దీనిని సామాన్యుల వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సంస్కృత భారతిపై ఉందని ఆయన కోరారు. సంస్కృతం నేర్చుకోవడం వల్ల మేధస్సు వికాసం చెందుతుందని, ఇది కేవలం ఒక భాష మాత్రమే కాకుండా ఒక సంస్కృతిని, సంస్కారాన్ని మోసుకెళ్తుందని ఆయన అన్నారు. పుట్టినప్పటి నుండి శ్వాస తీసుకోవడం ఎలాగైతే నిత్య కృత్యమో, అలాగే సంస్కృత భాషా సేవ కూడా నిత్యం కొనసాగాలని పిలుపునిచ్చారు.
సంస్కృత భారతి అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీశ దేవపూజారి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ప్రపంచంలోని 22 దేశాలలో సంస్కృత ప్రచారానికి కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,000 కేంద్రాలు నడుస్తున్నాయని, త్వరలోనే ప్రతి బ్లాక్ స్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేసి సంస్కృతాన్ని జనం వద్దకు తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు.
మై హోమ్ ఎండీ జె. రంజిత్ రావుకు సన్మానం
కార్యక్రమానికి ముందు నిర్వహించిన పరిచయ సెషన్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జె. రంజిత్ రావును మోహన్ భాగవత్ వేదికపైకి ఆహ్వానించి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి