డిటాక్స్ డ్రింక్‌ తాగితే.. లివర్ క్లీన్ అవుతుందా..? ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా..

డిటాక్స్ డ్రింక్‌ తాగితే.. లివర్ క్లీన్ అవుతుందా..? ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా..


ఈ రోజుల్లో లివర్ డిటాక్స్ డ్రింక్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ డిటాక్స్ డ్రింక్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రచారం చేస్తున్నారు. ఇది చూసి, చాలా మంది ఈ పానీయాలను తాగడం ప్రారంభించారు. ప్రజలు వైద్యుడిని సంప్రదించకుండానే నేరుగా తయారు చేసుకుని తాగుతున్నారు. కానీ ఈ పానీయాలు నిజంగా శరీరం నుండి విషపదార్థాలను తొలగించి కాలేయాన్ని శుభ్రపరుస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు… వాటితో ఏమైనా ప్రయోజనం ఉంటుందా..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

లివర్ డిటాక్స్ డ్రింక్స్, లేదా కాలేయాన్ని శుభ్రపరిచే పానీయాలను తరచుగా డిటాక్స్ డ్రింక్స్ అని పిలుస్తారు. అయితే, కాలేయం తనంతట తానుగా బాగుపడే అవయవమని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ ఆహారంపై శ్రద్ధ పెడితే, ప్రత్యేక డిటాక్స్ డ్రింక్ అవసరం లేదు. లివర్ డిటాక్స్ డ్రింక్స్ వల్ల కలిగే ప్రయోజనాలకు మద్దతుగా ఎటువంటి పక్కా శాస్త్రీయ ఆధారాలు లేవని అనేక అధ్యయనాలు కనుగొన్నాయని ఢిల్లీలోని ఎయిమ్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ అనన్య గుప్తా వివరిస్తున్నారు. కాలేయం అనేది రక్తాన్ని శుభ్రపరిచి, హానికరమైన పదార్థాలను తొలగించే ఒక అవయవం. అందువల్ల, ప్రత్యేక పానీయం అవసరం లేదు.

మరి ఈ పానీయాలను ఎందుకింత ప్రచారం చేస్తున్నారు?

పసుపు, అల్లం, నిమ్మకాయ కలిగిన అనేక డిటాక్స్ పానీయాలు ఉన్నాయని డాక్టర్ అనన్య గుప్తా వివరిస్తున్నారు. ఈ పదార్థాలు శరీరానికి మేలు చేసినప్పటికీ, మీ ఆహారపు అలవాట్లతో సంబంధం లేకుండా, వీటిని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని గ్యారెంటీ లేదు. అంటే, మీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తిన్నా, మద్యం సేవించినా, లేదా ఊబకాయంతో ఉన్నా, డిటాక్స్ పానీయాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరోవైపు, మీరు మీ ఆహారంపై శ్రద్ధ పెడితే, మీ కాలేయం ఆరోగ్యంగా ఉండి, దానంతట అదే విషాన్ని తొలగించుకుంటుంది.. కాబట్టి అదనపు పానీయాల అవసరం ఉండదు.

ఈ ట్రెండ్ ఎందుకంత ప్రజాదరణ పొందింది?

ప్రస్తుతం అనేక ఉత్పత్తులు డిటాక్స్ డ్రింక్స్ అనే ముసుగులో అమ్ముడవుతున్నాయని డాక్టర్ గుప్తా అంటున్నారు. ఇదంతా మార్కెటింగ్ ఎత్తుగడలో భాగమే. అయితే, ఈ ఉత్పత్తుల వల్ల తరచుగా పెద్దగా ప్రభావం ఉండదు. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి కూడా హాని కలగవచ్చు. అందువల్ల, అనవసరంగా అటువంటి డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం మానుకోండి. మీకు ఏవైనా కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన మార్గం ఏమిటి?

ఫాస్ట్ ఫుడ్ మానుకోండి.. ఒకవేళ తినాలనిపిస్తే నెలకు ఒకసారి తినవచ్చు.

అధిక నూనె మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

మద్యం సేవించడాన్ని పరిమితం చేయండి.

ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

తగినంత నీరు త్రాగండి.

మంచిగా నిద్రపోండి..

ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలనున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *