భక్తుల కొంగుబంగారం, ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక అరుదైన, వినూత్న నిరసన వెలుగు చూసింది. సాధారణంగా భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడానికి హుండీల్లో కానుకలు వేస్తుంటారు. కానీ కొండగట్టులో మాత్రం భక్తులు డబ్బులకు బదులుగా తమ ఆవేదన లేఖలను హుండీల్లో వేశారు. ‘‘సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?’’ అంటూ భక్తులు సూటిగా ప్రశ్నిస్తూ రాసిన లేఖలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
అసలు ఏం జరిగింది..?
ఇటీవల కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 16 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, మాలధారులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో 14 హుండీలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు చేపట్టగా, అధికారులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. నగదుతో పాటు పదుల సంఖ్యలో భక్తులు రాసిన నిరసన లేఖలు బయటపడ్డాయి.
లేఖల్లో భక్తుల ప్రశ్నలు – అసంతృప్తి
హుండీలో లభించిన లేఖల్లో భక్తులు ఆలయ నిర్వహణపై ఘాటుగా స్పందించారు. ప్రధానంగా కొన్ని సమస్యలను ప్రస్తావించారు. వేలాది మంది వచ్చే చోట కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై మండిపడ్డారు. కనీస వసతులు లేని వాష్ రూమ్స్ వల్ల మహిళలు, వృద్ధులు నరకం చూశారని పేర్కొన్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని, అక్కడ కనీస వసతులు కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు.
ముందు వసతులు.. తర్వాతే కానుకలు
ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది.. కానీ ఆ ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదు? అని భక్తులు లేఖల్లో నిలదీశారు. ముందు వసతులు మెరుగుపరచండి.. ఆ తర్వాతే మేము హుండీలో కానుకలు వేస్తామని భక్తులు స్పష్టం చేయడం గమనార్హం. గత కొంతకాలంగా ఆలయ అభివృద్ధిపై స్థానికులు, భక్తులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఇలా హుండీల్లో లేఖలు వేసి నిరసన తెలపడం ఆలయ చరిత్రలోనే అరుదైన ఘటనగా అధికారులు భావిస్తున్నారు.
అధికారులకు హెచ్చరిక
ఈ లేఖలు కేవలం భక్తుల అసంతృప్తి మాత్రమే కాదు, ఆలయ అధికారులకు, ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తి, విశ్వాసాలతో వచ్చే భక్తుల సహనాన్ని పరీక్షించకుండా, ఇప్పటికైనా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే భక్తుల ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.