ప్రపంచవ్యాప్తంగా స్నానపు సమయాలు ఆయా దేశాల వాతావరణం, పని సంస్కృతిపై ఆధారపడి ఉంటాయి. భారత్, అమెరికా, యూరప్ దేశాల్లో అత్యధిక మంది ఉదయాన్నే స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి, రాత్రి నిద్ర వల్ల కలిగే మత్తును వదిలించుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. జపాన్, కొరియా, చైనా సహా పలు ఆసియా దేశాల్లో రాత్రిపూట స్నానం చేసే అలవాటు ప్రాచీన కాలం నుండి ఉంది. జపనీయులకు నిద్రపోయే ముందు స్నానం చేయడం ఒక విశ్రాంతినిచ్చే ఆచారంగా పరిగణిస్తారు.
చైనా, జపాన్ వంటి దేశాల్లో ప్రజలు రాత్రి స్నానానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. రాత్రిపూట వేడినీటి స్నానం చేయడం వల్ల కండరాలు సేదతీరుతాయి. ఇది ‘‘రోజు ముగిసింది.. ఇప్పుడు విశ్రాంతి సమయం’’ అనే సంకేతాన్ని మెదడుకు పంపి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. రోజంతా బయట తిరగడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, చెమట, విషపదార్థాలను తొలగించడానికి రాత్రి స్నానం అత్యవసరం.
జపనీయుల పని సంస్కృతిలో ఒత్తిడి ఎక్కువ. రాత్రి స్నానం ఆ ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతపరుస్తుంది. రాత్రి స్నానం చేసి పడుకోవడం వల్ల శరీరంపై ఉండే బ్యాక్టీరియా పరుపులకు అంటుకోదు, తద్వారా చర్మ ఆరోగ్యంతో పాటు పరుపులు కూడా శుభ్రంగా ఉంటాయి. కాగా ఉదయం స్నానం నిద్రమత్తును వదిలించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. రోజువారీ పనులకు సిద్ధం కావడానికి మనస్సును ఉత్తేజపరుస్తుంది. రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టే వారికి ఉదయం స్నానం చేయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?: అనేక అధ్యయనాల ప్రకారం.. రాత్రిపూట స్నానం చేయడం వల్ల అలసట తగ్గి నిమిషాల్లోనే శరీరం ఉత్తేజం పొందుతుంది. నిద్రపోయే కనీసం 90 నిమిషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని సైన్స్ చెబుతోంది.
నిజానికి, ఉదయం, రాత్రి.. ఈ రెండు సమయాల్లోనూ స్నానం చేయడం వల్ల వాటికవే ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది నిపుణులు రోజుకు రెండుసార్లు స్నానం చేయడమే అత్యుత్తమమని సూచిస్తున్నారు. మీ జీవనశైలి, పని ఒత్తిడిని బట్టి మీకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు.




