మంచిర్యాల జిల్లా గోదావరి తీర ప్రాంతంలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోదావరి సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనతో ఉలిక్కి పడ్డ పశువుల కాపారి భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న జనం గోదావరి తీరంలో ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబుల ను చూసి షాక్ అరయ్యారు. ఈ ఘటన కవ్వాల్ అభయారణ్యానికి సమీపంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గోదావరి తీరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గోదావరి సమీపంలో మేతకు వెళ్లిన గేదెల మంద మేత మేస్తుండగా ఒక్క సారిగా పెద్ద ఎత్తున బాంబుల శబ్ధం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన పశువుల కాపారి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ తీవ్రంగా గాయపడిన గేదె కనిపించింది. పక్కనే చెట్ల పొదల్లో నాటు బాంబులు కనిపించాయి. వాటిని చూసి బయపడిపోయిన పశువుల కాపరి వెంటనే సమీపంలోని గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్ల పొదల్లో పడి ఉన్న 30 కి పైగా నాటు బాంబులను గుర్తించారు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఈ నాటుబాంబులను అడవి పందులను వేటాడేందుకు తయారు చేసినట్టుగా పోలీసులు కనిపెట్టారు. తమ నుంచి తప్పించుకునేందుకు నిందితులే ఇలా రహస్య ప్రాంతాల్లో వీటిని దాచి పెట్టుంటారని అభిప్రాయపడ్డారు.
అయితే చెట్ల పొదల్లో ఉన్న బాంబులను ఆహారంగా భావించి తినేందకు ప్రయత్నించడంతో బాంబు పేలి గేదె గాయపడి ఉండోచ్చని పోలీసులు, రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రగాయాల పాలైన గేదె బాదంపల్లికి చెందిన సమ్మయ్య అనే రైతుకు చెందినదిగా గుర్తించారు. దాని చికిత్స నిమిత్తం పశువుల హాస్పిటల్‌కు తరలించారు. ఇలా పశువులు, మనషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్ననాటు బాంబులు అమర్చే వేటగాళ్లను పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
ఇక కవ్వాల్ అభయారణ్యంలో నాటు బాంబులను ఉపయోగించి వన్యప్రాణుల వేట యదేచ్చగా సాగుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. మందు గుండు సామగ్రి నిల్వలను గుర్తించడంలో పోలీసుల నిఘా కొరవడటం కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.