Hyderabad: వీసీ సజ్జనర్ స్పెషల్ డ్రైవ్.. స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

Hyderabad: వీసీ సజ్జనర్ స్పెషల్ డ్రైవ్.. స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో ఆకస్మిక తనిఖీలు


హైదరాబాద్, ఏప్రిల్ 18: శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. పొగాకులోని నికోటిన్‌కు అలవాటు పడటం అనేది మాదకద్రవ్యాల ఊబిలోకి వెళ్లేందుకు మొదటి మెట్టుగా మారుతోంది. విద్యాసంస్థల సమీపంలో లభించే పొగాకు ఉత్పత్తుల వల్ల విద్యార్థులు క్రమంగా ఆల్కహాల్, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఈ అలవాట్లు చివరకు వారిని చిన్నపాటి నేరాల నుంచి తీవ్రమైన నేరాల వైపు పురికొల్పి, వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. ఈ విషవలయాన్ని ప్రాథమిక దశలోనే తుంచివేసేందుకు పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) 2003 సెక్షన్ 6(b) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాలలోపు పొగాకు విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. అలాగే మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల అమలును పక్కాగా పర్యవేక్షిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.

పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో శనివారం సుమారు 5 వేల మంది సిబ్బంది విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 558 షాపుల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ డ్రైవ్ లో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నారు. సీపీ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లెపల్లి ప్రియా టాకీస్ జంక్షన్, గోశామహాల్ వంటి రద్దీ ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

గోషామహల్‌లోని ఎంజే బ్రిడ్జి వద్ద సీపీ మీడియాతో మాట్లాడుతూ.. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టిన డెకాయ్ ఆపరేషన్‌లో పలు దుకాణదారులు నిబంధనలను బేఖాతరు చేస్తూ చిన్నపిల్లలకు పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నట్లు ఆధారాలతో సహా తేలిందని వివరించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఇలాంటి విక్రయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ తరహా నేరాలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా ‘హెచ్‌-న్యూ’ విభాగంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పెనుముప్పును అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యతే కాదని, విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సైతం సామాజిక బాధ్యతగా స్పందించాలని కోరారు. విద్యాసంస్థల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. పిల్లల ప్రవర్తన, వారి స్నేహితులు, పాఠశాల ముగిసిన తర్వాత వారి కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా హెచ్-న్యూ ఫోన్ నంబర్ 8712661601కు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *