మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిని ముట్టుకోకపోవడమే శ్రేయస్కరం.
విరేచనాల ముప్పు..
మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రధాన ఇబ్బందుల్లో కడుపు నొప్పి ఇంకా విరేచనాలు ముఖ్యమైనవి. నీరు జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును అడ్డుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్టలో గందరగోళం మొదలవుతుంది. ఇది వికారం లేదా కడుపులో ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మామిడి పండులోని ఫ్రక్టోజ్ (సహజ చక్కెర) నీటితో కలిసినప్పుడు బ్యాక్టీరియా చర్య వేగవంతమై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఆరోగ్యంగా ఉండాలంటే మామిడి పండు తిన్న తర్వాత కనీసం ముప్పై నుండి నలభై నిమిషాల వరకు వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి పండులోని విటమిన్లు ఇంకా ఖనిజాలు రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత నీళ్లు తాగడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మామిడి పండ్లను రాత్రి పూట కంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం వల్ల అవి మెరుగ్గా జీర్ణమవుతాయి. పండు తినే ముందు దానిని గంట పాటు నీటిలో నానబెట్టడం వల్ల అందులోని వేడి తగ్గి చర్మానికి ఎటువంటి అలర్జీలు రాకుండా ఉంటాయి.
ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును ఆస్వాదించేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణే మనల్ని దీర్ఘకాలిక రోగాల నుండి కాపాడుతుంది. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు మీకు ఉంటే వెంటనే దానిని మార్చుకోండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి నియమాలను పాటిస్తూ ఈ వేసవిని ఆనందంగా గడపండి. మన శరీరానికి ఏది అవసరమో.. ఎప్పుడు అవసరమో గుర్తించి మెలగడమే అసలైన విజ్ఞత.