బిల్లుకు మద్దతు పలకకపోతే.. మహిళలకు వ్యతిరేకులే: అమిత్ షా బిగ్ స్టేట్మెంట్

బిల్లుకు మద్దతు పలకకపోతే.. మహిళలకు వ్యతిరేకులే: అమిత్ షా బిగ్ స్టేట్మెంట్


లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై జరిగిన కీలక చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ప్రాతిపదికగా చేసుకుని ఆయన కీలక ప్రసంగం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో 56 మంది మహిళా ఎంపీలు పాల్గొనడం విశేషమని అమిత్ షా పేర్కొన్నారు. ఈ బిల్లును ఏ పార్టీ నేరుగా వ్యతిరేకించలేదని, అయితే ప్రతిపక్ష కూటమి అమలు తీరుపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. “2029 లోక్‌సభ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ స్ఫూర్తితోనే జరుగుతాయి” అని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తికి జవాబుదారీగా ఉండాలని, లేనిపక్షంలో పోలింగ్‌లో మహిళల నుంచి వ్యతిరేకత తప్పదని ప్రతిపక్షాలను హెచ్చరించారు.

నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాల ఆందోళనలను కొట్టిపారేస్తూ, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని అమిత్ షా వివరించారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో 45 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరికొన్ని చోట్ల 6 లక్షలే ఉన్నారు. ఇది రాజ్యాంగంలోని ‘సమాన ఓటు విలువ’ సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. 1971లో 56 కోట్లు ఉన్న జనాభా నేడు 140 కోట్లకు చేరిందని, దానికి అనుగుణంగా ప్రాతినిధ్యం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ వ్యతిరేకించడం అంటే ఎస్సీ, ఎస్టీలకు పెరగాల్సిన సీట్లను అడ్డుకోవడమేనని ఆయన విమర్శించారు. 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, వీరికి సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీని ఓబీసీ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. 1951, 1971లలో కుల గణనను అడ్డుకున్న కాంగ్రెస్, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఓబీసీ జపం చేస్తోందని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. 2026 జనాభా లెక్కలను కుల గణనతో కలిపి నిర్వహిస్తామని, దీనిని వాయిదా వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.

రాజ్యాంగం ప్రకారం మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని అమిత్ షా పునరుద్ఘాటించారు. “రిజర్వేషన్లు పుట్టుకతో వస్తాయి, మతంతో కాదు. బుజ్జగింపు రాజకీయాల కోసమే విపక్షాలు ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాయి” అని ఆయన అన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించబోదని తేల్చి చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనే ప్రచారాన్ని అమిత్ షా గణాంకాలతో తిప్పికొట్టారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రస్తుతం 23.76% ప్రాతినిధ్యం (129 సీట్లు) ఉంది. పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య 195కి పెరుగుతుందని, ఇది మొత్తం సీట్లలో 23.87% అవుతుందని ఆయన వివరించారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి దేశాన్ని ముక్కలు చేయాలని చూసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

ఈ బిల్లులు మహిళల రాజకీయ సాధికారతకు, దేశంలో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి కీలకమని అమిత్ షా పేర్కొన్నారు. ఓటింగ్ ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. మహిళా శక్తి, సామాజిక న్యాయం దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *