Bread Pakora: మసాలా ఫిల్లింగ్, పైన కరకరలాడే టాపింగ్.. నోరూరించే బ్రెడ్ పకోడాను పర్ఫెక్ట్‌గా ఇలా చేయండి!

Bread Pakora: మసాలా ఫిల్లింగ్, పైన కరకరలాడే టాపింగ్.. నోరూరించే బ్రెడ్ పకోడాను పర్ఫెక్ట్‌గా ఇలా చేయండి!


వారాంతం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక కొత్త వంటకం రుచి చూడాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు లేదా సాయంత్రం చల్లని గాలితో టీ తాగుతున్నప్పుడు వేడివేడి బ్రెడ్ పకోరాలు ఉంటే ఆ మజానే వేరు. తెలుగు రాష్ట్రాల్లో బజ్జీలు, పకోడీలు ఎంత ఫేమస్సో.. బ్రెడ్ పకోరా కూడా అంతే ఇష్టంగా తింటారు. హోటల్ స్టైల్‌లో కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా ఉండే బ్రెడ్ పకోరాలను అతి తక్కువ సమయంలో ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.

కావలసిన పదార్థాలు
ఈ వంటకానికి మన వంటింట్లో సాధారణంగా దొరికే బ్రెడ్ ముక్కలు (4), ఒక కప్పు శనగపిండి, పసుపు, జీలకర్ర, ఉప్పు, చిటికెడు వంట సోడా సరిపోతాయి. లోపల స్టఫింగ్ కోసం ఉడికించిన బంగాళదుంపలు (4), సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఇంగువ, చాట్ మసాలా గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. వీటికి తోడు పుదీనా చట్నీ, టొమాటో కెచప్ ఉంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళదుంపలను స్మాష్ చేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మసాలాలు కలిపి రుచికరమైన ‘ఆలూ మసాలా’ను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, పసుపు, ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి నీళ్లతో చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కపై పుదీనా చట్నీ పూసి, దానిపై బంగాళదుంప మసాలాను పరవాలి. మరో ముక్కకు కెచప్ పూసి పైన మూసివేసి, దానిని త్రిభుజాకారంలో (Triangle shape) కట్ చేయాలి.

వేయించే విధానం..
బాణలిలో నూనెను మధ్యస్థ వేడిలో వేడి చేయాలి. సిద్ధం చేసుకున్న బ్రెడ్ ముక్కలను శనగపిండి మిశ్రమంలో అటు ఇటు ముంచి, జాగ్రత్తగా నూనెలో వేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి, ఆ తర్వాత పేపర్ నాప్కిన్‌పైకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదనపు నూనె పీల్చుకుంటుంది. వేడివేడి బ్రెడ్ పకోరాలను అల్లం టీ లేదా గ్రీన్ చట్నీతో వడ్డిస్తే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే.

పర్ఫెక్ట్ పకోరాల కోసం…
శనగపిండి మిశ్రమం మరీ పల్చగా ఉంటే బ్రెడ్ నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది, కాబట్టి బ్యాటర్ చిక్కగా ఉండేలా చూసుకోండి. పకోరాలు మరింత కరకరలాడాలంటే శనగపిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండిని కలపండి. నూనె మరీ ఎక్కువగా వేడెక్కితే పకోరాలు పైన మాడిపోయి లోపల ఉడకవు, కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో వేయించడం ముఖ్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *