భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.
ప్రభుత్వం ప్రధానంగా 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా, లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రక్రియను సాకారం చేసేందుకు ప్రభుత్వం మూడు వేర్వేరు బిల్లులను ముందుకు తెచ్చింది.
1. మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026.
2. డీలిమిటేషన్ బిల్లు, 2026: నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కోసం నిర్థేశించింది.
3. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026: యూటీలలో మార్పుల కోసం తీసుకువస్తున్న సవరణ.
2029 లో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు గట్టిగా మద్దతు ఇస్తూ, నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే భారతదేశంలో ప్రజాస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుతుందన్నారు. అయితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రతిపక్ష వర్గాల లెక్కల ప్రకారం, ఈ బిల్లులను ఆమోదించడానికి కనీసం 345 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే, ప్రస్తుత ప్రభుత్వ బలం 302 వద్దే నిలిచిపోయింది. “సంఖ్యాబలం లేని ఈ సమయంలో ఇటువంటి కీలక బిల్లులను తీసుకురావడం కేవలం రాజకీయ వ్యూహమే తప్ప, అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు” అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ బిల్లుల అమలు జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు మహిళా సాధికారతకు ఇది పెద్ద పీట వేస్తుందని మద్దతుదారులు అంటుంటే, మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తే సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని హోం మంత్రి అమిత్ షా లోక్ సభకు హామీ ఇచ్చారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుండి 195 కి పెరుగుతామని, శాతం వాటా 23.76 శాతం నుండి 23.87 శాతానికి పెరుగుతుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి అవసరమైన ఆ 43 మంది ఎంపీల మద్దతు ఎక్కడి నుండి వస్తుంది? ఇతర పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయా లేక ఈ బిల్లులు పార్లమెంటులోనే ఆగిపోతాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా ఒక పెద్ద రాజకీయ యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.