Cooking oil effects: ఒక రోజుకు ఎంత వంట నూనె వాడాలి? ఏ నూనె ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Cooking oil effects: ఒక రోజుకు ఎంత వంట నూనె వాడాలి? ఏ నూనె ఆరోగ్యానికి మంచిదో తెలుసా?


మన భారతీయ వంటకాల్లో నూనె అనేది విడదీయలేని భాగం. ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు ప్రతి దశలోనూ నూనెను విరివిగా ఉపయోగిస్తాం. అయితే, రుచి కోసం మనం వాడుతున్న అధిక నూనె మన ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 23.5 లీటర్ల నూనెను వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి అసలు ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఎంత నూనె వాడాలి? ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఐసీఎంఆర్ (ICMR) మార్గదర్శకాలు
భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకారం, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 20 మిల్లీలీటర్లకు మించి నూనె వాడకూడదు. అంటే దాదాపు నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే. ఒకవేళ మీ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే, నెలకు మీ నూనె వినియోగం గరిష్ఠంగా 4 లీటర్లకు మించకుండా చూసుకోవాలి. నూనె పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు, ఎందుకంటే విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలను శరీరం గ్రహించాలన్నా, శారీరక శ్రమకు అవసరమైన శక్తి లభించాలన్నా సరైన మోతాదులో కొవ్వు అవసరం. కానీ, మోతాదు మించితే మాత్రం రక్తనాళాల్లో పూడికలు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులకు దారి తీస్తుంది.

మరిగించిన నూనె మళ్లీ వాడటం ప్రాణాంతకమా?
మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. ఒకసారి డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం. ఇలా పదే పదే మరిగించిన నూనెలో విషపూరిత రసాయనాలు ఏర్పడతాయి. ఇది కాలేయం దెబ్బతినడానికి క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరగడానికి కారణమవుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులుహెచ్చరిస్తున్నారు. నూనె రంగు మారినా, జిగురుగా తయారైనా లేదా దుర్వాసన వచ్చినా దానిని వెంటనే పారేయడం ఉత్తమం. వేడి చేసినప్పుడు పొగ వస్తున్న నూనెను వాడటం వల్ల శరీరంలో ఆక్సీకరణ ప్రక్రియ పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్.. ఏది మేలు?
నూనె నాణ్యత విషయంలో కోల్డ్ ప్రెస్డ్ (గానుగ) నూనెలు అత్యుత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో రసాయనాలు ఉండవు, సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అలాగే ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ తయారీలో గింజలను అధిక వేడికి గురి చేయడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. ఆరోగ్యకరమైన హృదయం కోసం వేరుశనగ, కొబ్బరి, నువ్వుల నూనెలను లేదా ఆవ నూనెను మార్చి మార్చి వాడటం మంచిది. ఒకే రకమైన నూనె కాకుండా వివిధ రకాల నూనెలను కలిపి లేదా నెలనెలా మారుస్తూ వాడటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అందుతాయి.

గమనిక: ఈ వార్తలో సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు లేదా మీ డైట్‌లో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *