Vaibhav Suryavanshi : ఈడెన్ గార్డెన్స్‌లో నంబర్ 1 అవుతాడా? ఏప్రిల్ 19న వైభవ్ సూర్యవంశీకి అగ్నిపరీక్ష

Vaibhav Suryavanshi : ఈడెన్ గార్డెన్స్‌లో నంబర్ 1 అవుతాడా? ఏప్రిల్ 19న వైభవ్ సూర్యవంశీకి అగ్నిపరీక్ష


Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న యువ కెరటం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ఏప్రిల్ 19 అత్యంత కీలకమైన రోజుగా మారనుంది. ఆ రోజున కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరగనున్న పోరు వైభవ్ రికార్డుల భవిష్యత్తును నిర్ణయించనుంది. ముఖ్యంగా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారతీయుడిగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకునే సువర్ణ అవకాశం అతడి ముందుంది. ప్రపంచ రికార్డును తృటిలో చేజార్చుకున్నప్పటికీ, భారత దిగ్గజాలను వెనక్కి నెట్టి స్వదేశీ రికార్డును తన పేరు రాసుకోవాలని వైభవ్ పట్టుదలగా ఉన్నాడు.

దేవదత్ పడిక్కల్ రికార్డుపై కన్ను

ప్రస్తుతం టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారతీయుడిగా దేవదత్ పడిక్కల్ రికార్డు ఉంది. పడిక్కల్ కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్‌ల్లో 901 పరుగులు చేశాడు. అంటే ఏప్రిల్ 19న కేకేఆర్ మీద ఆడే మ్యాచ్ అతడికి 24వ ఇన్నింగ్స్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో గనుక వైభవ్ మరో 99 పరుగులు చేస్తే, 24 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసి, పడిక్కల్‌ను వెనక్కి నెట్టి భారత్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంటాడు.

ప్రపంచ రికార్డు మిస్సైనా.. స్వదేశీ రికార్డు పక్కా

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌కు ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశం ఉండేది. టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ప్రపంచ బ్యాటర్‌గా గుర్తింపు పొందాలని భావించినా, ఆ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో ఆ ఛాన్స్ చేజారిపోయింది. అయితేనేం, ఇప్పుడు భారత స్టార్లను దాటేసే అవకాశం మాత్రం అతడి చేతుల్లోనే ఉంది. ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో అభిమానులు వైభవ్ ఇన్నింగ్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

కోహ్లీతో ఆరెంజ్ క్యాప్ యుద్ధం

రికార్డులు మాత్రమే కాకుండా, ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా వైభవ్ దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులు సాధించి టాప్ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 228 పరుగులతో అగ్రస్థానంలో ఉండి ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఏప్రిల్ 19 మ్యాచ్‌లో వైభవ్ గనుక భారీ స్కోరు సాధిస్తే, కోహ్లీని దాటేసి మళ్లీ ఆరెంజ్ క్యాప్‌ను తన తల పై అలంకరించుకునే అవకాశం ఉంది.

వైభవ్ సూర్యవంశీ ఫామ్

ఈ కుర్రాడి బ్యాటింగ్ శైలి చూస్తుంటే ఏ బౌలర్‎ను కూడా భయం లేకుండా ఎదుర్కుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతడు కీలక ఓపెనర్‌గా మారిపోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో మైదానం నలుమూలలా బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. కోల్‌కతా బౌలర్లను ఎదుర్కొని, ఆ 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే వైభవ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతడు నంబర్ 1 అవుతాడా లేడా అనేది ఏప్రిల్ 19 రాత్రికి తేలిపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *