ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..


లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సాగింది. బిల్లుపై చర్చించాలా వద్దా అనే దానిపై విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఓటింగ్ జరిగింది. బిల్లుపై చర్చకు 207 మంది సభ్యులు మద్దతు తెలిపారు. బిల్లును వ్యతిరేకిస్తూ 126 మంది ఓటేశారు. ఓటింగ్‌ సమయంలో సభలో 333 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో బిల్లు ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. అనంతరం రాజ్యాంగ సవరణ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. చర్చను ప్రారంభించిన న్యాయశాఖమంత్రి మేఘ్వాల్.. పార్లమెంటు చరిత్రలో లిఖించదగిన రోజు ఇది .. అని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంటుందన్నారు. 40 ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలో మహిళా బిల్లు పాసైందని.. ఇప్పుడు అదే స్పూర్తితో చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయన్నారు.

కాగా.. డీలిమిటేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం హైజాక్‌ చేస్తోందని ఆరోపించి వేణుగోపాల్.. 2024లో 33% రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిల్లు పెట్టేందుకు ఇంత తొందర ఎందుకు అని ప్రశ్నించారు ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్. జనగణన చేస్తే కులగణన లెక్కలూ బయటకు వస్తాయని.. కుల రిజర్వేషన్లను తప్పించుకునేందుకే బిల్లు పెడుతున్నారు ఆరోపించారు.

జనగణనతోపాటు కులగణన జరుగుతుందన్నారు అమిత్‌షా. కొంతమంది ముస్లిం మహిళల రిజర్వేషన్‌ గురించి మాట్లాడుతున్నారని అయితే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ తన పార్టీ టికెట్లు మొత్తం ముస్లిం మహిళలకే ఇచ్చుకున్నా కూడా తమకు అభ్యంతరం లేదన్నారు..

123 RP యాక్ట్‌కు ఈ బిల్లు వ్యతిరేకమన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణలు రాజ్యాంగ విరుద్దమని ఆరోపించింది డీఎంకే. ఇవి శాండ్‌విచ్ బిల్లులని విమర్శించారు ఆ పార్టీ ఎంపీ బాలు..

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా.. మూడు బిల్లులపై 12 గంటలపాటు చర్చ జరగనుంది. అవసరమైతే స్పీకర్‌ సమయాన్ని పొడిగించవచ్చు అని కేంద్రం పేర్కొంది. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరగనున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.

లైవ్ వీడియో..

డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడులో నిరసనలు..

డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాల లాభపడతాయని ఆరోపిస్తున్నారు. DMK ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో… నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరవేశారు. అంతేకాకుండా డీలిమిటేషన్ బిల్లు ప్రతిని కూడా దహనం చేసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల స్థానాలను మార్చేందుకు ఉద్దేశించిన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఈ బిల్లు తీరని నష్టం చేకూరుస్తుందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఈ డీలిమిటేషన్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆపబోమని స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

ఇక టీవీకే అధినేత విజయ్ కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లుతో తమిళనాడు రాష్ట్రం నష్టపోతుందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *