
వంట గ్యాస్ కొరత దేశాన్నే వెంటాడుతోంది. కమర్షియల్ సిలిండర్ల సప్లై తగ్గిపోవడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతబడ్డాయి. ఇప్పుడీ కొరత వివాహాలు, శుభకార్యాలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వివాహాలకు విందు భోజనాలు వడ్డించడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం భోజనాలు చేసి వెళ్లడం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. అయితే ఇప్పుడీ గ్యాస్ ట్రబుల్‌తో పెళ్లిళ్ల ఎలా జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వివాహమైనా, శుభకార్యమైనా వేలాది మందికి పైగా అతిథులు వస్తారు. గతంలో అయితే ప్లేట్‌కు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ వెజిటేరియన్ భోజనం ఉండేది. కానీ నేడు దానిని మరింతగా పెంచేశారు. ఒక్కొక్క ప్లేట్ ధర పదిహేను వందల రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది. మరొకవైపు గ్యాస్ కొరత వల్ల కట్టెలు, బొగ్గులతో వంటలు చేయించి వడ్డించేందుకు కొన్ని హోటల్స్ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్లేట్ రేట్ అమాంతం పెరిగింది. అటు ఫంక్షన్ హాల్స్ కూడా వంటల విషయం తమకు సంబంధంలేదని, పాత్రలు, నీటి సరఫరా మాత్రమే చేస్తామని షరతులు పెడుతున్నారు.
సరే వంట మనుషులను పెట్టుకుని ఎలాగోలా ఇబ్బంది పడి కట్టెల పొయ్యి మీద వంట చేయిద్దామంటే దానికి వాళ్లూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. పొగ వల్ల ఇబ్బందవుతోందని.. గ్యాస్ మీద గంటలో అయ్యే పని కట్టెల పొయ్యి మీద మూడు-నాలుగు గంటలు పడుతుందంటున్నారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు ఆ తిప్పలు మాకొద్దు బాబోయ్ అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.