
గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్) అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా కొనసాగుతోంది. ఆరు జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. దాదాపు 1500 పడకలు ఉన్న ఈ ఆసుపత్రికి ప్రతి రోజూ నాలుగు నుంచి ఐదు వేల మంది ఓపీ రోగులు వస్తున్నారు. ఓపీ స్లిప్ తీసుకునేందుకు ఉదయం ఆరు గంటల నుంచే రోగులు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓపీ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు ఉండటాన్ని గమనించారు. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు రోగులు, వారి సహాయకులు క్యూలైన్లలో వేచి ఉండి ఓపీ స్లిప్ తీసుకుంటున్న పరిస్థితిని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోగులకు ఈ ఇబ్బందులు లేకుండా చేయడానికి జిజిహెచ్‌లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఓపీ స్లిప్ పొందేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. 95523 00009 అనే నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపితే ఓపీ స్లిప్ జనరేట్ అయ్యే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మెసేజ్ పంపగానే అవసరమైన సేవల గురించి మెను కనిపిస్తుంది. అందులో ఓపీ ఆప్షన్ ఎంచుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల జాబితా కనిపిస్తుంది. అందులో ఆసుపత్రిని ఎంపిక చేసిన తర్వాత ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు అంకెలను నిర్ధారించగానే అపాయింట్‌మెంట్ కన్‌ఫర్మ్ అవుతుంది. ఈ విధంగా ఫోన్ ద్వారానే అపాయింట్‌మెంట్ తీసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు.
గత మూడు రోజులుగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రతి రోజూ 40 నుంచి 60 మంది రోగులకు ఓపీ స్లిప్స్ జారీ చేస్తూ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఓపీ నమోదు వ్యవస్థను ఆధునికీకరించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే జిజిహెచ్‌లో ఆధునిక పద్ధతిలో ఓపీ నమోదు చేసే విధంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా సంవత్సరమంతా తోటకూరను ఇలా పెంచొచ్చు..