
2025–26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసి, 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొన్ని కీలక ఆర్థిక పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ పనులు సమయానికి పూర్తి చేస్తే పన్ను భారం తగ్గించుకోవడమే కాకుండా జరిమానాలు, అదనపు వడ్డీ నుంచి కూడా తప్పించుకోవచ్చు.
పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు పొందేందుకు కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో PPF, SSY, NSC వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఖాతాలు కొనసాగించాలంటే కనీస మొత్తాన్ని జమ చేయడం కూడా అవసరం. ఉద్యోగులు సంవత్సరం ప్రారంభంలో పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు తమ సంస్థలకు తెలియజేసి ఉంటే, వాటికి సంబంధించిన రుజువులను మార్చి 31లోపు యజమానికి సమర్పించాలి. ఈ రుజువులు ఇవ్వకపోతే కంపెనీ జీతం నుంచి ఎక్కువ మొత్తంలో TDS కట్ చేసే అవకాశం ఉంది.
ఇక ముందస్తు పన్ను చెల్లింపులు కూడా చాలా ముఖ్యమైనవి. మొత్తం పన్ను బాధ్యత రూ.10,000 కంటే ఎక్కువగా ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి. దీనిని సమయానికి చెల్లించకపోతే వడ్డీ, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా తీసుకున్నవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. వ్యక్తి, కుటుంబ సభ్యుల కోసం రూ.25,000 వరకు, 60 ఏళ్లు పైబడినవారికి రూ.50,000 వరకు, తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై రూ.75,000 వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
అలాగే గతంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ITR-U ద్వారా రిటర్న్‌ను నవీకరించుకునే అవకాశం ఉంది. అదనంగా గృహ రుణం తీసుకున్న వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(B) కింద గృహ రుణ వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ నేపథ్యంలో మార్చి 31లోపు ఈ ఆర్థిక పనులను పూర్తి చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ పన్ను భారం తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి