
Telangana SSC Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి (మార్చి 14-శనివారం) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పదో తరగతి పరీక్షల్లో ఓఎంఆర్ (OMR) షీట్ విధానం కొనసాగనుంది. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన ఓఎంఆర్ షీట్‌ను విద్యార్థులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ విధానం గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన నమూనా మోడల్‌తో పాటు వివరణాత్మక వీడియోలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను 9.35 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు.
పరీక్ష కేంద్రాల్లోకి వీటికి అనుమతి లేదు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం. విద్యార్థులు ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే తీసుకురావాలని అధికారులు సూచించారు.
పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని SSC పబ్లిక్ పరీక్షా కేంద్రాల చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ పరిధిలో ఆంక్షలు
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఈ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీసు కమిషనర్లు వేర్వేరు ఉత్తర్వులలో, అన్ని పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల వ్యాసార్థంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు.
మార్చి 14న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 16న సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. హైదరాబాద్‌లో ఎస్ఎస్సి పరీక్షల సమయంలో ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయబడతాయి. మాల్‌ప్రాక్టీస్‌ను నివారించడానికి, SSC పరీక్ష సమయంలో కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఫోటోకాపీ, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
అయితే, విధుల్లో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది, హోంగార్డులు, విద్యా శాఖ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్లు, అంత్యక్రియల ఊరేగింపులకు ఆంక్షలు పాటించకుండా మినహాయింపు ఉంటుంది.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ 2026 షెడ్యూల్:
- మార్చి 14, 2026 (శనివారం): ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, పార్ట్-II
- మార్చి 18, 2026 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 23, 2026 (సోమవారం): థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మార్చి 28, 2026 (శనివారం): మ్యాథమెటిక్స్
- ఏప్రిల్ 2, 2026 (గురువారం): సైన్స్ పార్ట్-I (ఫిజికల్ సైన్స్)
- ఏప్రిల్ 7, 2026 (మంగళవారం): సైన్స్ పార్ట్-II (బయోలాజికల్ సైన్స్)
- ఏప్రిల్ 13, 2026 (సోమవారం): సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 15, 2026 (బుధవారం): ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్), స్ఎస్సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)
- ఏప్రిల్ 16, 2026 (గురువారం): ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం, అరబిక్).