
పెళ్లై దాదాపు 14 ఏళ్లు అయింది.. మొదట్లో అన్యోన్య దాంపత్య జీవితం.. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.. భార్య బాగా చదువుతుందని భావించిన అతను.. ప్రభుత్వ ఉద్యోగం వైపు ప్రోత్సాహం అందించాడు.. దీంతో ఆమె కూడా చదువుకుని.. ఎక్సైజ్ సీఐగా ఎదిగింది. ఆ తర్వాతే.. అసలు కథ మొదలైంది. మంచి పొజిషన్ లోకి వచ్చిన తర్వాత.. ఆమె భర్తను దూరం పెట్టింది.. అదేంటని ప్రశ్నిస్తే.. అతనిపై కట్నం కోసం వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. దీంతో అంతేకాకుండా.. మానసికంగా వేధించడం మొదలుపెట్టింది.. దీంతో మనస్థాపం చెందిన ఆ వ్యక్తి.. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాధ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరం పరిధిలోని నేరేడ్మెట్ లక్ష్మీనగర్‌లో నివసించే నగెల్లి శ్రీనివాస్ (41) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్.. శ్రీనివాస్ 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భార్య గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి శ్రీనివాస్ ప్రోత్సాహం అందించాడు. తర్వాత జ్యోతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది.
అయితే.. జ్యోతికి ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. దీంతో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ భార్యకు దూరంగా ఉంటున్నాడు. కోర్టు కేసులు, భార్య వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. వేలాడుతూ కనిపించాడు.. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..