
కరివేపాకు అనేది భారతీయ వంటకాలలో ఒక ముఖ్యమైన భాగం. ఇంటి తోటలో కరివేపాకు చెట్టును పెంచడం ద్వారా తాజా ఆకులను పొందవచ్చు. అయితే, చాలామంది తమ కరివేపాకు చెట్టు సరిగా పెరగడం లేదని లేదా పురుగులు ఆకులను తినేస్తున్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగా, చెట్టు ఆరోగ్యంగా, వేగంగా పెరగడానికి కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను తెలుసుకుందాం. కేవలం ఆరు నెలల్లో ఆరు అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు పెంపకంలో ఉపయోగించిన పద్ధతులను ఇక్కడ వివరంగా అందిస్తున్నాము.
1. సేంద్రియ చీడపీడల నియంత్రణ స్ప్రే: కరివేపాకు ఆకులను పురుగులు, కీటకాలు తినకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన సేంద్రియ స్ప్రేను తయారుచేయవచ్చు.
ఈ స్ప్రే తయారీకి కావలసినవి: మూడు రోజులు పులిసిన మజ్జిగ తేట నీరు: అర లీటరు సాధారణ మంచి నీరు: అర లీటరు (1:1 నిష్పత్తిలో). ఇంగువ పొడి: అర స్పూను (ఒక లీటరు ద్రావణానికి), పసుపు: ఒక స్పూను, దాల్చిన చెక్క పొడి..అర టీ స్పూను.
తయారీ విధానం: పులిసిన మజ్జిగ నీటిలో సాధారణ నీటిని కలపాలి. ఆ తర్వాత ఇంగువ పొడి, పసుపు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కరిగేలా కలపాలి. ఇంగువ ముద్ద లేదా స్టోన్ రూపంలో ఉంటే, రెండు మూడు గంటలు నీటిలో నానబెట్టి వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన ఉంచి, చిన్న నలకలు ఏమైనా ఉంటే వడపోసి స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. ఈ స్ప్రేను 15 నుండి 30 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.
వినియోగం:
1. ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి కరివేపాకు చెట్టు కాండం నుంచి లేత ఆకుల వరకు పూర్తిగా పిచికారీ చేయాలి. ఇది ఆకుల పైన దాడి చేసే వార్మ్స్, తెల్లదోమ (ఎల్లో అఫిడ్స్) వంటి కీటకాలను నివారిస్తుంది. దాల్చిన చెక్క పొడి నేలలో నెమటోడ్స్ (రూట్ వార్మ్స్) రాకుండా కాపాడి, వేర్లు బలంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇది 100% సేంద్రియ పద్ధతి కాబట్టి, ఆకులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. స్ప్రే ద్రావణంలో కొంత భాగాన్ని మొక్క మొదట్లో పోయడం వల్ల కూడా లాభం ఉంటుంది.
2. బియ్యం కడిగిన నీటి వినియోగం: సాధారణ నీటికి బదులుగా బియ్యం కడిగిన నీటిని కరివేపాకు చెట్టుకు పోయడం వల్ల అది చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉంచిన బియ్యం కడిగిన నీటిని సమాన పాళ్ళలో సాధారణ నీటితో కలిపి చెట్టుకు పోయాలి. ఇది చెట్టుకు అవసరమైన పోషకాలను అందించి, వేగవంతమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.
3. సేంద్రియ ఎరువులు: కరివేపాకు చెట్టుకు నైట్రోజన్ అధికంగా ఉండే ఎరువులు అవసరం, ఎందుకంటే మనం ఆకులను మాత్రమే ఉపయోగిస్తాము. ప్రతి నెల లేదా పదిహేను రోజులకోసారి కింది ఎరువులలో ఏదో ఒకదాన్ని ఉపయోగించవచ్చు.
వర్మి కంపోస్ట్ (వానపాముల ఎరువు): రెండు మూడు గుప్పిళ్లు మట్టి పైన వేయాలి.
ఆవు పేడ : రెండు మూడు గుప్పిళ్లు మట్టి పైన వేయాలి. ఇందులో నైట్రోజన్ అధికంగా ఉండటం వల్ల ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
వేపపిండి : రెండు స్పూన్లు వేపపిండిని నెలకోసారి వేయడం వల్ల చెట్టు బుషీగా పెరుగుతుంది.
ఎప్సమ్ సాల్ట్ : నెలకోసారి ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఆకులు చాలా పచ్చగా, దట్టంగా వస్తాయి. ఎరువు వేసిన తర్వాత కొద్దిగా నీరు పోయాలి, తద్వారా పోషకాలు మట్టిలోకి చేరతాయి.
ప్రూనింగ్ (కొమ్మలు కత్తిరించడం) చిట్కాలు: కరివేపాకు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు కొమ్మలను కత్తిరించకూడదు. కేవలం మనకు అవసరమైన రెమ్మలను మాత్రమే తుంచుకోవాలి. చిన్న మొక్క ఉన్నప్పుడు కొమ్మలు కత్తిరిస్తే చెట్టు ఎదుగుదల నెమ్మదిస్తుంది. కరివేపాకు చెట్టు సుమారు 10 అడుగుల ఎత్తుకు పెరిగిన తర్వాత కొమ్మలను కత్తిరించడం వల్ల అది మరింత బుషీగా, దట్టంగా పెరుగుతుంది. గ్రో బ్యాగ్‌లలో పెంచేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన చిట్కా. కొమ్మలు కత్తిరించిన ప్రతిసారీ పైన చెప్పిన సేంద్రియ ఎరువులను (ఆవు పేడ, వర్మి కంపోస్ట్ లేదా ఎప్సమ్ సాల్ట్) వేసి, బియ్యం కడిగిన నీటిని పోయాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ కరివేపాకు చెట్టు కూడా వేగంగా పెరిగి, ఆరోగ్యకరమైన, పెస్ట్ రహిత ఆకులను అందిస్తుంది.