
భారతదేశంలో రైల్వే వ్యవస్థ రూపురేఖలు వచ్చే ఏడాదిలో పూర్తిగా మారనున్నాయి. రైలు కనెక్టివిటీలో మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు దేశంలో పరుగులు పెడుతుండగా.. రానున్న కాలంలో బుల్లెట్ రైళ్లు పట్టాలపై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లనున్నాయి. ఇటీవల కేంద్రం బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించగా.. ఇవి నిర్మాణం పూర్తైతే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది క్లారిటీ వచ్చింది. మొదటి రైలును ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.
తొలి బుల్లెట్ ట్రైన్ ఎక్కడంటే..?
దేశంలోని తొలి బుల్లెట్ రైలును 2027 ఆగస్టులో ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. సూరత్-వాపి రూట్లో దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ఇది మొదలుకానుంది. ఇప్పటికే ఈ రూట్లో సిగ్నలింగ్, మౌలిక సదుపాయల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశీయ సాంకేతికతతో పనులు చేపడుతుండగా.. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మార్గంలో నడిపేందుకు తొలి బుల్లెట్ రైలును బీఈఎంఎల్ అభివృద్ది చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. బీ28 అని పిలవబడే రైలు సెట్‌ను తయారుచేస్తోంది. ఆగస్టు 15, 2027లో తొలి రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో రైల్వేశాఖ ఈ వివరాలను పొందుపర్చింది.
ఈ మార్గంలోనే మొదటి రైలు..
సూరత్-వాపి మార్గంలో 97 కిలోమీటర్ల దూరానికి బుల్లెట్ రైలు ప్రవేశపెడతారు. 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఇది కలిగి ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థపై ఇప్పటికే పనులు ప్రారంభమవ్వగా.. ఈటీసీఎస్ లెవల్ 2 టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించగా.. త్వరలో పనులు షురూ కానున్నాయి. పనుల్లో భాగంగా హైస్పీడ్ రైల్వే ట్రాక్‌లు, విద్యుత్ వ్యవస్థలు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, రైలు సెట్ల సరఫరా వంటివి చేపడతారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య కారిడార్ నిర్మాణానికి 2015లో రూ.97,636 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఆ తర్వాత వ్యయం పెరుగుతూ వస్తోంది. పన్నులు, సెస్‌లతో పాటు యుటిలిలటీ షిప్టింగ్, విద్యుత్ సోర్సింగ్ ఏర్పాట్లు, అటవీ క్లియరెన్స్, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి కారణాలతో ఖర్చు పెరుగుతూ వస్తోంది. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉత్పత్తి ఖర్చులతో రూ.19,084 కోట్లకు అంచనా పెరిగింది. ఇక భూసేకరణ ఖర్చులు కూడా వ్యయాన్ని పెంచాయి. పట్టణాల్లో భూసేకరణ, పునరావాసం ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి.