
Gautam Gambhirs Vision for Team India: 2026 భారత టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన తర్వాత, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ జట్టు భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన లక్ష్యాలను ప్రకటించారు. ఈ విజయం ఒక ముగింపు కాదని, టీం ఇండియా ప్రయాణానికి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్తులో టీ20 మ్యాచ్‌లలో 300 పరుగుల మార్కును అందుకోవడం భారత జట్టు తదుపరి లక్ష్యమని గంభీర్ వెల్లడించారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో సాధించిన అద్భుత విజయం మరుసటి రోజు, స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇకపై మరింత దూకుడుగా, సాహసోపేతంగా ఆడాలని ఆయన కోరుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్ దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని చూపింది. జట్టులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ అద్భుతమైన విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తంలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌ను ఓడిపోయింది. అది కూడా సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ, “ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. టీ20లో ఇప్పటివరకు మేము 300 పరుగుల మార్కును అందుకోలేదు. ఒకరోజు తప్పకుండా ఆ రికార్డును అందుకోవాలని ఆశిస్తున్నాం. అది కూడా చిన్న జట్లతో కాకుండా పెద్ద జట్లపై ఈ రికార్డును నెలకొల్పాలని చూస్తున్నాం. ఈ క్రమంలోనే మేము ఇంకా మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
కోచ్‌గా తన బాధ్యతల గురించి వివరిస్తూ, ఆటగాళ్లకు మంచి వాతావరణం కల్పించడం, వారికి భద్రతగా అనిపించేలా చేయడం, తన అనుభవాన్ని వారితో పంచుకోవడం చాలా ముఖ్యమని గంభీర్ అన్నారు. అలా చేస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువమంది చదివినది: టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?
గౌతం గంభీర్ ఇప్పటికే 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన తొలి భారత కోచ్‌గా అరుదైన ఘనత సాధించారు. ఇక ముందు 2027 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడం తన ప్రధాన లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల సాధన కోసం జట్టు నిరంతరం కృషి చేస్తుందని, మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..