Bank Notes: దేశంలో చెలామణిలో ఉన్న తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్లపై కీలక ప్రకనట చేసింది. ఈ నోట్లు కొరత లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, ఆర్బిఐ ప్రకారం, తక్కువ విలువ కలిగిన నోట్లను సాంప్రదాయకంగా ఎటిఎంల ద్వారా పంపిణీ చేయడం లేదని అన్నారు.
“చిన్న విలువ కలిగిన నోట్లను డిస్పెన్సర్ల ద్వారా పంపిణీ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది” అని ఆయన సభకు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 26 వరకు) 439.40 కోట్ల రూ.10 నోట్లను, 193.70 కోట్ల రూ. 20 నోట్లను, 130.30 కోట్ల రూ. 50 నోట్లను కేంద్ర బ్యాంకు సరఫరా చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో (FY25) 180 కోట్ల రూ.10 నోట్లను, 150 కోట్ల రూ. 20 నోట్లు, 300 కోట్ల రూ. 50 నోట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. నిరంతర ప్రక్రియలో భాగంగా, RBI వివిధ డినామినేషన్ నోట్ల అవసరాన్ని అంచనా వేస్తుంది. అలాగే ముద్రించడానికి అవసరమైన డినామినేషన్ మిశ్రమంపై ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది.
తక్కువ విలువ కలిగిన కరెన్సీకి ఉన్న డిమాండ్‌ను బ్యాంకు నోట్లు, నాణేల ద్వారా తీర్చవచ్చు. అంతేకాకుండా, తక్కువ విలువ కలిగిన లావాదేవీలతో సహా మొత్తం లావాదేవీలలో డిజిటల్ చెల్లింపు పద్ధతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌ను తీర్చడానికి తగిన పరిమాణంలో నోట్లు, వివిధ విలువలతో కూడిన నాణేలను నిరంతరం చెలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆర్బిఐ తెలియజేసిందని మంత్రి తెలిపారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నివేదించిన ప్రకారం.. మరో ప్రశ్నకు బదులిస్తూ, రూపే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో (2025 డిసెంబర్ 31 నాటికి) రూ.111.17 కోట్ల విలువైన 3.72 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు మంత్రి తెలిపారు.




