
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్… స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.. అందుకే.. తమ పెళ్లికి రారండోయ్.. అంటూ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ.. మల్లారెడ్డి మళ్లీ పెళ్లి సంగతేంటో చూద్దాం..!
హంగామా అంటే మల్లారెడ్డి.. మల్లారెడ్డి అంటేనే హంగామా.. పాలమ్మినా.. పూలమ్మినా అంటూ సోషల్‌మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు మరో హంగామాతో సందడి చేయబోతున్నారు. స్టేజ్ ఎక్కినా.. డీజే సౌండ్ వినిపించినా.. యంగ్ డైనమిక్లా రెచ్చిపోయే మల్లారెడ్డి.. సరికొత్తగా ప్రేమకు వయసు ఉండదని మరోసారి నిరూపించబోతున్నారు. అందుకే.. తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆమెను మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడుతున్నారు. మార్చి 19వ తేదీన జరిగే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ వేడుకలో భాగంగా.. కొత్త పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్ సహా అన్ని కార్యక్రమాలతో ఓ ఊపు ఊపబోతున్నారు. ఈ క్రమంలోనే.. మార్చి 12 గురువారం నుంచి మల్లారెడ్డి ఇంట్లో ప్రత్యేక పెళ్లి కార్యక్రమాలు షురూ కాబోతున్నాయి.
మల్లారెడ్డి 50వ పెళ్లిరోజును పురస్కరించుకుని మూడు రోజుల క్రితం కీసరలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మల్లారెడ్డి జోష్‌కు తగ్గట్లే ఓ సరికొత్త నామకరణం చేశారు. మల్లారెడ్డి మళ్లీ పెళ్లి నేపథ్యంలో మల్పన అని హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవాలని ఆయనకు సూచించడం నవ్వులు పూయించింది. ఈ మధ్య వివాహం చేసుకున్న నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన.. వారి పెళ్లి సెలబ్రేషన్స్‌కి విరోష్ అని పేరు పెట్టుకున్నారు. అదే రేంజ్లో మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీకి కూడా కేటీఆర్ మల్పన అని నామకరణం చేయడంతో.. దాన్నే సీరియస్‌గా తీసుకున్న మల్లారెడ్డి అందర్నీ అలాగే ఆహ్వానిస్తున్నారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా రాజకీయ నేతలందరినీ ఆహ్వానించారు. సినీ ప్రముఖులతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలువురు వీఐపీలను కూడా ఇన్వైట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన మల్లారెడ్డి.. 50వ వివాహ వార్షికోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. కేటీఆర్‌కు కూడా ఆహ్వానం అందించగా.. మార్చి 14వ తేదీన మల్లారెడ్డి సంగీత్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇదిలావుంటే.. నార్మల్‌గానే స్టెప్పులతో రెచ్చిపోయే మల్లారెడ్డి.. మరి ఆయన గోల్డెన్ జూబ్లీ పెళ్లి వేడుకల్లో ఊరుకుంటారా.. నెవ్వర్ చాన్స్.. అందుకే.. సంగీత్ కార్యక్రమానికి వారం రోజుల నుంచి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారట మల్లారెడ్డి దంపతులు. రెండు, మూడు సూపర్ హిట్ పాటలతో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారన్న మాట. మొత్తంగా.. ఐదు రోజుల గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో మల్లారెడ్డి మ్యారేజ్ యానివర్సరీ దుమ్ము రేపబోతోంది. అర్ధశతాబ్దపు వివాహ బంధాన్ని అట్టహాసంగా నిర్వహించుకునేందుకు మల్లారెడ్డి ఏర్పాట్లు చేస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..