సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాకిస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణం బూచిగా చూపించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సాకుతో ఏకంగా వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు.
గత మూడేళ్ల కాలంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంట్లో వెల్లడించారు. ఎంతెంత వసూలు చేశాయనే వివరాలను లెక్కలతో సహా నిర్మలమ్మ తెలిపారు.
2022-23 నుంచి 2024-25 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం కలిపి ఏకంగా రూ.19 వేల కోట్లు కస్టమర్ల ఖాతాల నుంచి కట్ చేశాయి. ఈ జరిమానాలు వసూలు చేయడంతో దేశంలో నెంబర్ వన్ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ ముందు వరుసలో నిలిచింది. ఆ ఒక్క బ్యాంకే ఏకంగా జరిమానాల క్రింద రూ.3,872 కోట్లు వసూలు చేసింది.
ఆ తర్వాత రూ.2,706 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ రెండో స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,225 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసి మూడో స్ధానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా రూ.1,578 కోట్లు ఫైన్ వసూలు చేసినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ మాత్రం 2020 నుంచే మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలను పూర్తిగా ఎత్తేసింది. దీంతో కస్టమర్లకు భారీ ఊరట కలిగింది. ఆ సందర్బంగా బ్యాంకులు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే ఈ ఛార్జీలు వసూలు చేయాలని నిర్మలా సీతారామన్ తెలిపారు.




