
‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే టాలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా తన వద్దకు వచ్చిన, తనకు నచ్చిన, తాను మెచ్చిన కథలకు జీవం పోస్తూ, తన మార్క్‌ను చూపిస్తూ వచ్చారు మార్క్ కె రాబిన్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మార్క్ కె రాబిన్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్నారు. ఇప్పటి వరకు మార్క్ కె రాబిన్‌కి ఎన్నో అవార్డులు, ఎంతో గుర్తింపు లభించింది. కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం అతడి ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని అందించింది.
“8AM Metro”తో మార్క్ బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా ఐరా అవార్డును సాధించారు. అలా మెట్టు మెట్టు ఎదుగుతూ వస్తున్న మార్క్ కె రాబిన్‌కి గద్దర్ అవార్డుతో ఇప్పుడు తగిన గుర్తింపు లభించినట్టు అయింది. ఇక ‘దండోరా’ చిత్రానికి గానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డు లభించింది. మార్క్ కె రాబిన్ అందించిన పాటలు, ఇచ్చిన సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి, మరీ ముఖ్యంగా “దండోరా” టైటిల్ సాంగ్ ప్రేక్షకులను కదిలించాయి. ‘దండోరా’ సినిమాని తన ఆర్ఆర్తో మరో స్థాయికి తీసుకు వెళ్లిన మార్క్ కె రాబిన్‌కి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని, అవార్డుని ఇచ్చింది.
మార్క్ కె రాబిన్ కెరీర్లో ‘మల్లేశం’లాంటి గొప్ప సినిమాలెన్నో ఉన్నాయి. ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ‘జాంబీ రెడ్డి’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయాల్ని నమోదు చేశాయి. నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, చెప్పిన టైంలోనే సంగీతాన్ని అందిస్తుంటారు మార్క్ కె రాబిన్. అలాంటి మార్క్‌కి ‘మళ్లీ కలుద్దాం’తో సైమా 2017 బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్లో డిలి బిలీకి సైతం అవార్డు వచ్చింది. ‘సూర్యకాంతం’ సినిమాకి గానూ మార్క్ ఇచ్చిన సంగీతానికి మిర్చి మ్యూజిక్ వారి నుంచి బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్ అవార్డు వచ్చింది. ‘మల్లేశం’ సినిమాలోని ‘నాకు నువ్వని’ పాటకి బెస్ట్ కంపోజర్‌గా మిర్చి మ్యూజిక్ అవార్డ్ లభించింది. ఐరా అవార్డుల్లో భాగంగా బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మార్క్‌కి గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు ఆయన దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
View this post on Instagram
చిన్నప్పటి నుంచీ గద్దర్ పాటలు అంటే ఇష్టమని, అవి పాటలు కాదు ఫైర్ అని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఈనాడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఈ అవార్డుని, గుర్తింపును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు మార్క్ కె రాబిన్ ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇంత మంచి స్టోరీని, సినిమాని ఇచ్చిన దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి, తనకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన తన లిరిసిస్ట్, సింగర్స్‌కి మార్క్ కె రాబిన్ థాంక్స్ చెప్పారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.