
ఏటీఎంలలో ప్రస్తుతం రూ.500, రూ.200, రూ.100 నోట్లు వస్తున్నాయి. అన్నింటికంటే రూ.500 నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే పెద్ద నోట్లను మాత్రమే ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా.. చిన్న నోట్లను ఉపసంహరించుకునే సదుపాయం ఇప్పటివరకు అందుబాటులో లేదు. అయితే త్వరలో ఏటీఎం నుంచి రూ.10, రూ.20, రూ.50 లాంటి చిన్న నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా సాంప్రదాయ ఏటీఎంల నుంచి చిన్న విలువ కలిగిన నోట్లను పంపిణీ చేసే కార్యక్రమం మోదలైందని రాజ్యసభలో కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశంలో చిన్న నోట్ల కొరత లేదని స్పష్టం చేశారు.
తగినంతగా అందుబాటులో..
పార్లమెంట్లో ఓ ప్రశ్నకు పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. దేశంలో చిన్న నోట్ల కొరత లేదని, తగినంతగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రూ.10, రూ.20, రూ.50 చిన్న విలువ కలిగిన నోట్లు ఇప్పటికే తగినంత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.500, రూ.100, రూ.200 నోట్లు ఏటీఎంల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వీటి ద్వారా ఏదైనా కొనుగోలు చేయాలంటే చిల్లర సమస్య ఏర్పడుతుంది. ఇక ప్రజలు ఆన్లైన్లో ఎక్కువగా చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల కొరత ఏర్పడుతుంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఏటీఎంల నుంచి చిన్న నోట్లను కూడా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిల్లర సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక చిన్న విలువ డిస్పెన్సర్లు పరీక్షించబడుతున్నాయని, ఇవి ప్రజలు నేరుగా చిన్న కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ప్రజలను ఏటీఎంల నుంచి ఈ విధానంలో చిల్లర పొందగలుగుతారని పేర్కొన్నారు.
ఎన్ని నోట్లు ఉన్నాయంటే..?
చిన్న కరెన్సీ నోట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే దానిపై కేంద్ర ప్రభుత్వ రాజ్యసభలో వివరాలు వెల్లడించింది. ఫిబ్రవరి 26 వరకు కేంద్ర బ్యాంకు రూ.439.4 కోట్ల విలువైన రూ.10 నోట్లు సరఫరా చేయగా.. రూ.193.7 కోట్ల రూ.20 నోట్లు, రూ.130 కోట్ల రూ.50 నోట్లు సరఫరా చేసినట్లు తెలిపింద. ఇక గత ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్ల రూ.10 నోట్లు, రూ.150 కోట్ల రూ.20 నోట్లు సరఫరా చేయగా.. ఇక రూ.300 కోట్ల రూ.50 నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. వివిధ విలువల కరెన్సీలకు ఉన్న డిమాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని, ఎన్ని నోట్లను ముద్రించాలో సిఫార్సు చేస్తుందని పేర్కొంది.