
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న విలువైన బ్రాస్లెట్‌ను ఆలయ సిబ్బంది నిజాయితీగా తిరిగి అప్పగించారు. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీష్ స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు చెందిన సుమారు నాలుగు తులాల బంగారు బ్రాస్లెట్ (అంచనా విలువ రూ.8 లక్షల వరకు) ఆలయంలో ఎక్కడో పడిపోయింది.
ఆలయంలో ఔట్‌సోర్సింగ్ స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న డప్పు నాగమణికి ఆ బ్రాస్లెట్ దొరికింది. ఆమె వెంటనే ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ గారికి, పోలీసు సిబ్బందికి అందజేశారు. అనంతరం బ్రాస్లెట్ పోగొట్టుకున్న భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ఎంక్వయిరీ నిర్వహించి, ధృవీకరించిన అనంతరం వారికి తిరిగి అప్పగించారు.
నిజాయితీగా వ్యవహరించి బ్రాస్లెట్‌ను అప్పగించిన డప్పు నాగమణిని ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి గారి ఆదేశాల మేరకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ గారు ఆమెకు స్వామివారి, అమ్మవార్ల వస్త్రం మరియు లడ్డూ ప్రసాదం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..