
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ సాక్షిగా రణరంగం నెలకొంది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన రెండు కుటుంబాలు పోలీసుల ముందే బాహాబాహీకి దిగాయి. భార్యాభర్తల గొడవ కాస్తా.. ఇరు వర్గాల మధ్య దాడులకు దారితీయడంతో స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే తూప్రాన్ పోలీస్ స్టేషన్ మంగళవారం హైడ్రామాకు వేదికైంది. అల్లాపూర్ గ్రామానికి చెందిన జ్యోతికి, రాంపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు కూడా ఉన్నారు.. అయితే, కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. తనను భర్త వేధిస్తున్నాడంటూ జ్యోతి పోలీసులను ఆశ్రయించింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై జ్యోతి ఇరువర్గాలను స్టేషన్ కు పిలిపించారు.
ఇరువురు సమక్షంలో కౌన్సెలింగ్ మొదలుపెట్టారు. ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగానే.. దంపతుల మధ్య మళ్ళీ వాగ్వాదం మొదలైంది.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సహనం కోల్పోయారు. ఈ క్రమంలోనే బయట వేచి ఉన్న ఇరు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా ఒకరి పై ఒకరు భౌతిక దాడులకు దిగారు.
వీడియో..
దీంతో స్టేషన్ ఆవరణ రణరంగంగా మారింది. కొన్ని సెకన్లలోనే ఏం జరుగుతుందో.. ఏమోనన్న టెన్షన్ మొదలైంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాల ను విడదీసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.. మొత్తానికి భార్యాభర్తల పంచాయితీ..పోలీస్ స్టేషన్ లో వీధి పోరాటాన్ని తలపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..