ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం, పశ్చిమాసియాపై ప్రభావం క్రమంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇక రవాణా నిలిచిపోవడంతో ముడి చమురుతో పాటు గ్యాస్ ధరల్లో కూడా పెరుగుదల నమోదవుతోంది. దీంతో పాటు విదేశాల నుంచి సరఫరా నిలిచిపోవడం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్‌ను పెంచింది. 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీని వల్ల గ్యాస్ బుక్ చేసుకున్నాక 25 రోజుల తర్వాతనే మరో గ్యాస్ బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఈ క్రమంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థల కీలక ప్రకటన జారీ చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తోందని, ముడి చమురు సరఫరాలో అంతరాయాన్ని దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. LPG ఉత్పత్తిని మరింత పెంచాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
గృహ వినియోగదారులకు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి ముఖ్యమైన గృహేతర రంగాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపాయి. ఇతర గృహేతర రంగాల నుండి వచ్చే అభ్యర్థనలను చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సమీక్షించి.. యోగ్యత, అవసరం, ఉత్పత్తి, లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని తన ప్రకటనలో పేర్కొంది.
అయితే గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు బంద్ అయ్యాయి. దీని వల్ల వ్యాపారులు తీవ్ర నష్టపోతున్నారు. యుద్దం ఇలాగే మరికొద్దిరోజుల పాటు కొనసాగితే గ్యాస్ సంక్షోభం మరింత ముదిరే అవకాశముంది. దీంతో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ రంగం ఆయిల్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.




