
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ త్వరలో ముగియవచ్చని ఆయన సూచించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లపై కూడా ప్రభావం కనిపించింది. యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, కచ్చితమైన కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ.. మేం దీనిని ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాం అని చెప్పారు. ప్రపంచాన్ని బందీగా ఉంచి చమురు సరఫరాలను నిలిపివేయడానికి ఏ దేశాన్నీ అనుమతించబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ అలాంటి ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడు ఆ దేశం దీని నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
చమురు మార్కెట్లపై ప్రభావం
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కొంత మేర తగ్గాయి. యుద్ధం త్వరలో ముగియవచ్చనే సంకేతాలు పెట్టుబడిదారుల్లో ఆశలను పెంచాయి. అయితే త్వరలో అంటే ఒక వారంలోనా? అనే ప్రశ్నకు ట్రంప్ అలా కాదు, కానీ త్వరలోనే అని మాత్రమే సమాధానం ఇచ్చారు. ఇరాన్ సైన్యం ఇప్పటికే తీవ్రంగా బలహీనపడిందని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంపై ఆధిపత్యం సాధించి ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే కుట్రలో ఇరాన్ ఉందని ట్రంప్ ఆరోపించారు. మేం ఆ కుట్రను సమయానికి అడ్డుకున్నాం. అందులో పాల్గొన్నందుకు మాకు గర్వంగా ఉంది అని ఆయన అన్నారు.
ప్రపంచ చమురు సరఫరాలు అంతరాయం కలగకుండా చూడటానికి అమెరికా చర్యలు తీసుకుంటోందని ట్రంప్ వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న ట్యాంకర్లకు రాజకీయ ప్రమాద బీమా అందిస్తున్నామని తెలిపారు. అలాగే ధరలను తగ్గించేందుకు కొన్ని చమురు సంబంధిత ఆంక్షలను సడలిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే అమెరికా నావికాదళం, మిత్రదేశాలు ట్యాంకర్లను జలసంధి గుండా సురక్షితంగా తీసుకెళ్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి మళ్లీ రాకుండా ఉండేందుకు ఇరాన్ నాయకత్వంపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తంగా చూస్తే ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు మధ్యప్రాచ్య పరిస్థితులపై కొంత ఆశావాద సంకేతాలను ఇచ్చినప్పటికీ, యుద్ధం పూర్తిగా ముగిసే సమయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అదే సమయంలో ఈ పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లను, అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి