వేసవి వచ్చేసింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ క్రీం, కుల్ఫీ వంటి వాటిని ఆస్వాదించడం చాలా మందికి అలవాటే. అయితే చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత కొంత మందికి వెంటనే దాహం వేస్తుంది. దీంతో వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలని అనిపిస్తుంది. కొంత మంది తాగేస్తారు కూడా. కానీ ఇలా చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐస్ క్రీం గడ్డకట్టిన స్థితిలో ఉంటుంది. చల్లని ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. దీనివల్ల గొంతు నొప్పి, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు వస్తాయి. ఐస్ క్రీంలో పాల ఉత్పత్తులు, చక్కెర అధికంగా ఉంటాయి. వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల ఐస్ క్రీంలోని కొవ్వులు త్వరగా గట్టిపడతాయి. ఇది తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా కడుపు నొప్పి, ఉబ్బరం వస్తుంది.
చాలా మందికి ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లు తాగితే పంటి నొప్పి వస్తుందని ఫిర్యాదు చేస్తారు. చల్లగా ఉండే ఐస్ క్రీం వల్ల దంతాల ఎనామిల్ కుంచించుకుపోతుంది. వెంటనే నీళ్లు తాగితే దంతాలు సున్నితంగా మారుతాయి. దీంతో దంతాలు నొప్పిగా అనిపిస్తాయి.
స్వీట్లు తిన్న తర్వాత దాహం అనిపించడం వెనుక ఒక హార్మోన్ల ప్రక్రియ ఉంది. ఐస్ క్రీంలో ఉండే చక్కెర నోటిలో లాలాజలాన్ని తగ్గించి గొంతు ఎండిపోయేలా చేస్తుంది. స్వీట్లు తిన్న తర్వాత కాలేయం FGF21 అనే హార్మోన్ను స్రవిస్తుంది. ఈ హార్మోన్ మెదడులోని హైపోథాలమస్ భాగానికి శరీరానికి నీళ్లు అవసరమని నేరుగా సంకేతాన్ని ఇస్తుంది. ఇది దాహాన్ని కలిగిస్తుంది.
దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం సహజం. కానీ ఐస్ క్రీం తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. దీనివల్ల మీ గొంతు, దంతాలు సాధారణ ఉష్ణోగ్రతకు సర్దుబాటు కావడానికి సమయం లభిస్తుంది. ముఖ్యంగా ఐస్ క్రీం తిన్న తర్వాత ఫ్రిజ్లోని చల్లటి నీళ్లు అస్సలు తాగకూడదు. బదులుగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లు తాగడం బెటర్.




