
Sanju Samson vs Finn Allen: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్లో అందరి దృష్టి ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లపైనే ఉంది. వారే భారత స్టార్ సంజూ శాంసన్, కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్. సెమీఫైనల్లో వీరిద్దరూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తుంటే, ఫైనల్లో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీయడంలో వీరిద్దరూ దిట్ట.
సెమీస్‌లో సృష్టించిన సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సెమీఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కివీస్ ఫైనల్‌కు చేరడంలో అతని పాత్ర వెలకట్టలేనిది. అటు టీమిండియా తరఫున సంజూ శాంసన్ కూడా తక్కువ ఏమీ తినలేదు. సెమీఫైనల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఈ ఫామ్‌ను సంజూ ఫైనల్లోనూ కొనసాగిస్తే కివీస్ బౌలర్లకు నిద్రలేని రాత్రులే.
గణాంకాల్లో పోటాపోటీ
టీ20 అంతర్జాతీయ గణాంకాలను పరిశీలిస్తే, ఫిన్ అలెన్ కొంచెం ఆధిక్యంలో ఉన్నాడు. 60 ఇన్నింగ్స్‌ల్లో అలెన్ 1654 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 171గా ఉండటం గమనార్హం. అతని కెరీర్లో 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సంజూ శాంసన్ కూడా తన మార్కు చూపిస్తున్నాడు. 53 ఇన్నింగ్స్‌ల్లో 1310 పరుగులు చేసిన సంజూ, సుమారు 155 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజూ కూడా తన కెరీర్లో 3 సెంచరీలు బాదాడు. వీరిద్దరిలో ఎవరు కుదురుకున్నా స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ఖాయం.
ఫైనల్ లో అసలైన ఫైట్
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇలాంటి చోట సంజూ శాంసన్ క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్, ఫిన్ అలెన్ పవర్ హిట్టింగ్ మధ్య జరిగే యుద్ధం అభిమానులకు కన్నుల పండువగా ఉండబోతోంది. ఒకరు టీమ్ ఇండియాకు రెండోసారి టైటిల్ అందించాలని చూస్తుంటే, మరొకరు కివీస్‌కు తొలి టీ20 కప్పు తెచ్చిపెట్టాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఈ ఓపెనింగ్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..