
అసలు ఈ పైలేట్స్ వల్ల ఆమెకు కలిగిన ప్రయోజనాలేంటి? బాడీ బిల్డింగ్ కంటే ఇది ఎలా భిన్నమైనది? బాలీవుడ్ తార జాన్వీ కపూర్ తన నటనతోనే కాదు, తన ఫిట్నెస్తోనూ కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె జిమ్ బయట కనిపించే ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, మిగతా హీరోయిన్లలాగా ఆమె కేవలం కఠినమైన జిమ్ వర్కవుట్లపైనే ఆధారపడదు. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసా? అదే ‘పైలేట్స్’. శరీరాన్ని విల్లులా వంచడమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచే ఈ వ్యాయామంపై జాన్వీకి ఎందుకు అంత మక్కువో తెలుసుకుందాం..
కఠినమైన వర్కవుట్ల కంటే..
జాన్వీ కపూర్ పైలేట్స్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం—ఇది శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండానే బలాన్ని ఇస్తుంది. కఠినమైన వెయిట్ లిఫ్టింగ్ వల్ల కండరాలు పట్టేయడం లేదా గాయాలయ్యే ముప్పు ఉంటుంది. కానీ పైలేట్స్‌లో ప్రతి కదలిక నియంత్రిత పద్ధతిలో ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కు మరియు గాయాల నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది.
చాలామంది మహిళలు జిమ్ అంటే కండలు వచ్చేస్తాయని భయపడుతుంటారు. కానీ పైలేట్స్ వల్ల శరీరం బల్కీగా (లావుగా) మారదు. ఇది లోతైన కోర్ కండరాలను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల శరీరం దృఢంగా, చెక్కిన శిల్పంలా మారుతుంది తప్ప, స్టిఫ్ గా అనిపించదు. జాన్వీ నడకలో కనిపించే ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం ఆమె కోర్ స్ట్రెంత్. పైలేట్స్ వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది, తద్వారా బాడీ పోశ్చర్ మెరుగుపడుతుంది. షూటింగ్ సమయంలో గంటల తరబడి డ్యాన్స్ చేయాలన్నా, నిలబడాలన్నా ఆమెకు ఈ వ్యాయామమే బలాన్నిస్తుంది. ఇది కండరాల బిగుతును తగ్గించి, శరీరం సాఫీగా కదలడానికి సహకరిస్తుంది.
మానసిక ప్రశాంతత..
పైలేట్స్ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఒక మానసిక సాధన. శ్వాసపై నియంత్రణ, నెమ్మదైన కదలికలు ఒత్తిడిని తగ్గిస్తాయి. బిజీ షెడ్యూల్లో ఉండే జాన్వీకి, ఈ వర్కవుట్ మనసును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. ఇది అలసటను ఇవ్వదు సగదా, సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫిట్నెస్ అంటే ఏదో కష్టమైన పనిలా కాకుండా, ఒక జీవనశైలిలా మార్చుకోవాలని జాన్వీ కపూర్ నిరూపించింది. పైలేట్స్ ద్వారా బలం, ఫ్లెక్సిబిలిటీ మరియు బ్యాలెన్స్ ఎలా సాధించవచ్చో ఆమె ఒక ఉదాహరణ.