
IND vs NZ : మార్చి 8, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత అభిమానులకు 2023 వన్డే వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ట్రోఫీని గెలిచే క్రమంలో ఒక బిలియన్ భారతీయుల మనసులను ముక్కలు చేసేందుకు కూడా తాను వెనుకాడనని శాంట్నర్ బాహాటంగానే ప్రకటించాడు.
ప్యాట్ కమిన్స్‌ను గుర్తుచేస్తున్న శాంట్నర్
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. “లక్షకు పైగా ఉన్న స్టేడియం జనాలను మౌనంగా ఉంచడమే నా లక్ష్యం” అన్నాడు. చెప్పినట్టే కమిన్స్ ఆ రోజు భారత్ ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు శాంట్నర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. “మేము ట్రోఫీ గెలవడానికి ఇక్కడ ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని కోట్లాది మంది భారతీయుల హృదయాలు ముక్కలైనా నాకు పర్వాలేదు” అని శాంట్నర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కుండబద్దలు కొట్టాడు.
పిచ్ ఫోటో వైరల్.. 2023 సీన్ రిపీట్ అవుతుందా?
శాంట్నర్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో అతను తన మొబైల్ ఫోన్‌తో స్టేడియంలోని పిచ్‌ను ఫోటో తీసుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా 2023 ఫైనల్‌కు ముందు ప్యాట్ కమిన్స్ కూడా ఇలాగే పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఫోటో తీసుకున్నాడు. ఈ సారూప్యతను చూసి భారత అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈసారి అహ్మదాబాద్‌లో రెడ్ సాయిల్(ఎర్ర మట్టి), బ్లాక్ సాయిల్ (నల్ల మట్టి) కలిపిన మిశ్రమ పిచ్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఇది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని శాంట్నర్ అంచనా వేస్తున్నాడు.
అండర్ డాగ్స్ గా కివీస్.. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్
న్యూజిలాండ్ జట్టు ఈ టోర్నీలో చాలా నిలకడగా రాణిస్తోంది. సెమీఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. “మేము ఫేవరెట్స్ కాకపోవచ్చు, కానీ మా పని మేము సరిగ్గా చేస్తే కప్పు మాదే” అని శాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై కప్పు కొట్టి చరిత్ర తిరగరాయాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..