మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం యావత్ క్రికెట్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసిన ఒక హై-వోల్టేజ్ టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా ఏడు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని, వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకువెళ్ళింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. దీనికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్. కేవలం 42 బంతుల్లోనే మెరుపు వేగంతో 89 పరుగులు చేసి, ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని స్కోరు టీమిండియాకు బలమైన పునాది వేసింది.
ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు యువ ఆటగాడు జాకబ్ బెథెల్ అన్నీ తానై అండగా నిలిచాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఫ్యాన్స్‌ని, బౌలర్లను వణికించాడు. జాకబ్ బెథెల్ కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి, టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయానికి చేరువైన తరుణంలో, జస్ప్రీత్ బుమ్రా తన డెత్ ఓవర్స్ మ్యాజిక్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. చివర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, కీలక వికెట్లు తీసి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇంగ్లాండ్ సెన్సేషనల్ ప్లేయర్ జాకబ్ బెథెల్ ఐపీఎల్ 2026లో ఏ జట్టు తరపున ఆడబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోనే జాకబ్ బెథెల్ కొనసాగనున్నాడు. 2025 ఎడిషన్ నుంచి ఆర్సీబీతోనే ఉన్న బెథెల్ని ఈసారి ఆ ఫ్రాంచైజీ రూ. 2.60 కోట్లకు రిటైన్ చేసుకుంది.
జాకబ్ బెథెల్ కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ కూడా. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఇతనికి ఉంది. అతని ప్లేయింగ్ స్టైల్ చాలా దూకుడుగా ఉంటుంది. తక్కువ బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. బెథెల్ కేవలం 22 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అండర్-19 ప్రపంచకప్‌లో తన ప్రతిభని చాటుకొని, అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. అతని ఆల్‌రౌండ్ నైపుణ్యాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ 2026లో మరింత బలం చేకూర్చనున్నాయి.




