
ఎండాకాలంలో వేడి వేడి అన్నంలోకి రసం, పచ్చిపులుసు, సాంబార్లతో పాటు పెరుగు వంటకాలు తింటే చాలా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగు చారు లేదా మజ్జిగ పులుసు తింటే పొట్టకి చల్లగా ఉంటుంది. అయితే ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా ఈసారి తెలంగాణ స్టైల్లో చేసే సల్ల చారు/చల్ల చారు ట్రై చేయండి. తక్కువ పదార్థాలతో చాలా త్వరగా తయారయ్యే ఈ వంటకం ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా అన్నం ఇష్టంగా తింటారు. ఈ వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- పెరుగు – 1 లీటర్
- ఉప్పు – రుచికి సరిపడా
- అల్లం – 2 అంగుళాల ముక్క
- పచ్చిమిర్చి – 7–8
- కరివేపాకు – 2 రెమ్మలు
- ఉల్లిపాయలు – 2 (సన్నగా కట్ చేసినవి)
- కొత్తిమీర తరుగు – ఒక గుప్పెడు
- పసుపు – చిటికెడు
- నీరు – అవసరమైతే
తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరగాలి. ఒక పెద్ద గిన్నెలో పెరుగు తీసుకుని అందులో ఉప్పు వేసి విస్కర్ లేదా గరిటతో బాగా చిలకాలి. గడ్డలు లేకుండా మృదువుగా అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను పెరుగులో వేసి కలపాలి..
తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు కావాల్సిన దట్టత్వం (consistency) కోసం కొద్దిగా నీళ్లు వేసి మళ్లీ బాగా కలిపి పక్కన పెట్టాలి.
తాలింపు కోసం
- నూనె – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
- మెంతులు – అర టీస్పూన్
- ఆవాలు – 1 టీస్పూన్
- జీలకర్ర – 1 టీస్పూన్
- మినప్పప్పు – 1 టీస్పూన్
- శనగపప్పు – 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 8 నుంచి 10 (కొద్దిగా నలిపినవి)
- ఎండుమిర్చి – 5 నుంచి 6
- కరివేపాకు – కొద్దిగా
తాలింపు చేసే విధానం
- స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
- నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
- తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి స్వల్పంగా వేయించాలి.
- ఇప్పుడు నలిపిన వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
- చివరగా ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి.
- తాలింపు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును ముందుగా సిద్ధం చేసిన పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
సర్వింగ్ టిప్
ఈ సల్ల చారును వెంటనే తినవచ్చు. అయితే తయారు చేసిన తర్వాత 1–2 గంటలు ఉంచి తింటే రుచి ఇంకా బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలోకి పోసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
చిన్న టిప్: కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వాడితే సల్ల చారు రుచి ఇంకా బాగుంటుంది.