
ఎన్నడూ కనివినీ ఎరగని అత్యంత దారుణమైన ఘటన ఇది. ప్లే స్కూల్లో పిల్లలు అంటే.. ఫస్ట్ క్లాస్‌లోపు వయసు ఉండే పిల్లలు. మహా అంటే ఐదారేళ్లకు మించి ఉండవు. అలాంటి పసిపాప ప్రైవేట్ పార్ట్‌పై యాసిడ్ ఎటాక్ చేయడం ఎంత దారుణం. అదే జరిగింది విజయవాడ.. విద్యాధరపురంలోని నేషనల్ ప్లే స్కూల్లో..! అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం పాప పేరెంట్స్ స్కూల్లో డ్రాప్ చేసి వెళ్లారు. కాసేపటికి స్కూల్ నుంచి వాళ్లకి కాల్ వచ్చింది. పాప బాత్రూమ్లో పడిపోయిందని చెప్పారు. వాళ్లు వచ్చే సరికే తీవ్రంగా గాయపడిందంటూ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. తీరా గాయాలు చూస్తే అది జారిపడినట్లో, ఎవరో కొట్టినట్లో కూడా కాదు. పూర్తిగా యాసిడ్ ఎటాక్.. అది కూడా బాలిక ఒంటిపైనో, కంటిపైనో కాదు.. ప్రైవేట్ పార్ట్‌పై. ఆ గాయాలు చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఏంటీ పాపం అని స్కూల్ నిర్వాహకులను నిలదీశారు. పరువు పోతుందనో, బయటకు తెలియకూడదనో.. బతిమాలుకుంది ఆ స్కూల్ యాజమాన్యం. మరి ఆ పేరెంట్స్ కూడా ఎందుకు కనికరించారో తెలీదు గానీ.. సైలెంట్ అయ్యారనిపిస్తోంది. అయితే తాజాగా పాప మూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఆ రోజుకు ఆస్పత్రి బిల్లు కట్టేసి చేతులు దులుపుకున్న నేషనల్ ప్లే స్కూల్ నిర్వాహకుల తీరు చూసి పోలీస్ కేసు పెట్టారు. భవానీపురం పోలీసులు కూడా ఏ చర్యలూ తీసుకోవడం లేదని, న్యాయం కోసం ఇప్పుడు పాప తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పాప జీవితాన్ని నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..