
మనం విచారంగా ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. అలాగే ఎండలో తిరిగినా లేదా వ్యాయామం చేసినా చెమట పడుతుంది. అయితే ఈ రెండింటినీ గమనిస్తే మనకు ఒకే రకమైన ఉప్పు రుచి తగులుతుంది. ఇది ఏదో అనుకోకుండా జరిగే ప్రక్రియ కాదు మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఒక అద్భుతమైన జీవసంబంధమైన యంత్రాంగం. అసలు ఈ ఉప్పదనం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కన్నీళ్లలో ఉప్పు ఎందుకు ఉంటుంది?
కన్నీళ్లలో దాదాపు 98శాతం నీరు ఉంటుంది. మిగిలిన భాగం ఉప్పు, ప్రోటీన్లు, ఇతర అంశాలతో తయారవుతుంది. మన రక్తంలో లాగానే, కన్నీళ్లలో కూడా ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ ఉప్పు సహాయపడుతుంది. కన్నీళ్లు కేవలం భావోద్వేగాలకే కాదు, కళ్లు ఎండిపోకుండా నిరోధించడానికి, బ్యాక్టీరియా నుండి కళ్లను రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి.
చెమట ఎందుకు ఉప్పగా అనిపిస్తుంది?
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మన శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమటలో ప్రధానంగా నీరు ఉన్నప్పటికీ, దానితో పాటు సోడియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. శరీరం నుండి ఈ సోడియం విసర్జించబడటం వల్లే మనకు చెమట ఉప్పగా తగులుతుంది. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లవణీయత లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
సోడియం క్లోరైడ్: జీవన ఆధారం
కన్నీళ్లు, చెమటలో ఉండే అతి ముఖ్యమైన అంశం సోడియం క్లోరైడ్, దీనినే మనం సాధారణంగా ఉప్పు అని పిలుస్తాము. ఈ ఖనిజం కేవలం రుచి కోసం మాత్రమే కాద.. శరీర ఆరోగ్యానికి అత్యంత అవసరం.
- ఇది శరీరంలోని ద్రవ మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
- మెదడు, కండరాలు, నరాల మధ్య సంకేతాలు వెళ్లడానికి సోడియం కీలక పాత్ర పోషిస్తుంది.
- కణాల మరమ్మత్తుకు మరియు శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు ఇది సహాయపడుతుంది.
కాబట్టి మన శరీర ద్రవాలు ఉప్పగా ఉండటం అనేది ఒక లోపం కాదు.. అది మన శరీరం తనను తాను కాపాడుకోవడానికి నిర్వహించే ఒక అద్భుతమైన రసాయన ప్రక్రియ.