
తెలంగాణలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి 2027-28 వరకు వర్తించేలా ఈ కొత్త ఫీజుల నిర్మాణాన్ని ఖరారు చేస్తూ మార్చి 4న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. వివిధ కళాశాలలకు వేర్వేరు ఫీజులు నిర్ణయించారు.
- ACE ఇంజనీరింగ్ కాలేజీ: రూ.1,10,000
- అను బోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: రూ.1,08,100
- అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ: రూ.90,000
- భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ): రూ.89,000
- అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్: రూ.75,000
- అరోరా గ్రూప్ కళాశాలలు: వీటిలో రూ.45,000 నుండి గరిష్టంగా రూ.67,800 వరకు ఫీజులు ఉన్నాయి.
- అనేక కళాశాలలకు కనీస ట్యూషన్ ఫీజుగా రూ.45,000 నిర్ణయించారు
కమిటీ కీలక ఆదేశాలు
ఈ ఫీజుల వసూలు విషయంలో TAFRC స్పష్టమైన నిబంధనలను విధించింది. సంస్థలు వార్షిక ట్యూషన్ ఫీజును ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో ముందుగానే వసూలు చేయవచ్చు. నిర్ణయించిన రుసుములో ప్రత్యేక రుసుము, ప్రవేశ రుసుము ఉండవు. క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో ఎటువంటి అనధికారిక వసూళ్లకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఫీజుల ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని సంస్థ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగత లాభాల కోసం మళ్లించకూడదు.
గుర్తింపు ఉంటేనే అడ్మిషన్లు
రాష్ట్ర ప్రభుత్వం, AICTE లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల నుండి సరైన గుర్తింపు, అనుమతులు పొందని సంస్థలకు కోర్సులను నిర్వహించేందుకు అనుమతి ఉండదు. ఒకవేళ కళాశాలలు సమర్పించిన డేటా తప్పు అని తేలితే, ఫీజులను సవరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది. అడ్మిషన్లు పొందే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే చెల్లించాలని, అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా MS అడ్మిషన్లు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.