T20 World Cup 2026 : ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం మరో బిగ్ ఫైట్‌కు రెడీ అయిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భాగంగా నేడు (మార్చి 5) భారత్ – ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రోహిత్ శర్మ లేని ఈ యువ భారత్, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఫైనల్ బెర్తు కోసం గట్టిగా పోరాడుతోంది. అయితే, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును డీకొట్టాలంటే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోంది? గత మ్యాచుల్లోని లోపాలను సవరించుకుని ఏవైనా మార్పులు చేయబోతున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఓపెనింగ్ జోడీ విషయానికి వస్తే, సంజు శామ్సన్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కొండంత అండ. గత మ్యాచ్‌లో 97 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న సంజు, ఇప్పుడు అదే ఊపులో ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడాలని చూస్తున్నాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచి ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌లో అతను గాడిలో పడితే ప్రత్యర్థికి చుక్కలే. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి, ఈ ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభమే మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది.
మిడిల్ ఆర్డర్ బాధ్యతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా భుజాన వేసుకోనున్నాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి హిట్టర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉండటం టీమిండియాకు అదనపు బలం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హార్దిక్, దూబేలు గనుక చెలరేగితే స్కోరు బోర్డు పరుగులు తీయడం ఖాయం. వాంఖడే స్టేడియం సూర్యకు హోమ్ గ్రౌండ్ కాబట్టి, ఇక్కడ అతడి 360 డిగ్రీల బ్యాటింగ్ విందు చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. కొత్త బంతితో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీయగలిగితే ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడం సులభం అవుతుంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీతో ఇంగ్లీష్ బ్యాటర్లను తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అక్షర్ పటేల్ తన పొదుపైన బౌలింగ్‌తో పరుగులు నియంత్రించగలడు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంతో ఉన్న టీమ్ ఇండియా, ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ చేరుతుందో లేదో చూడాలి.
భారత్ తుది జట్టు
సంజు శామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..