Loan on Silver: వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు..? నిబంధనలు ఏంటంటే..?

Loan on Silver: వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు..? నిబంధనలు ఏంటంటే..?


బంగారంపై లోన్ గురించి చాలా మందికి తెలిసినా, వెండిపై కూడా రుణం తీసుకోవచ్చా అన్నది చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ వెండిపై రుణాలు ఇచ్చేందుకు అనుమతిస్తూ ఒక సర్కులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ఎవరు రుణాలు అందిస్తారు?

ఆర్‌బీఐ స్పష్టం చేసిన వివరాల ప్రకారం, అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) ఇకపై బంగారంతో పాటు వెండిపై కూడా రుణాలు ఇవ్వడానికి అనుమతి కలిగి ఉంటాయి.

ఎవరు రుణం పొందగలరు? దేనిపై రుణం ఇస్తారు?

ముడి లోహాలు (గనుల నుంచి తీసినవి), బులియన్ వెండి లేదా బులియన్ బంగారం, గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై రుణాలు ఇవ్వరు. అలాగే, ఇతరులు తనఖా పెట్టిన లోహాలను తిరిగి తనఖా పెట్టి రుణం పొందలేరు. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణేలు వంటి వాటిపై మాత్రమే స్వల్పకాలిక ఆర్థిక అవసరాల కోసం రుణం పొందవచ్చు.

తాకట్టు పరిమితులు:

ఆర్‌బీఐ తనఖా పెట్టగల బంగారం, వెండికి గరిష్ట పరిమితులను నిర్ణయించింది. బంగారు ఆభరణాలు గరిష్టంగా 1 కేజీ.  వెండి ఆభరణాలు: గరిష్టంగా 10 కేజీలు.  బంగారు నాణేలు: 50 గ్రాముల వరకు.  వెండి నాణేలు 500 గ్రాముల వరకు తాకట్టు పెట్టవచ్చు.

రుణ విలువ అంచనా (LTV): లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తిని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇది ప్రతి వంద రూపాయల విలువైన బంగారం లేదా వెండిపై ఎంత రుణం లభిస్తుందో తెలియజేస్తుంది. బంగారం లేదా వెండి విలువను నిర్ధారించడానికి రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో ఏది తక్కువగా ఉంటే దానిపై విలువను లెక్కిస్తారు. 1. గత 30 రోజుల సగటు ముగింపు ధర. 2. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) లేదా SEBI రెగ్యులేటెడ్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రకటించిన ముందు రోజు ముగింపు ధర. ఈ అంచనాలో లోహపు నికర విలువ మాత్రమే లెక్కిస్తారు, రత్నాలు, రాళ్ల విలువను పరిగణనలోకి తీసుకోరు. ఈ వాల్యుయేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని ఆర్‌బీఐ సూచించింది

*వినియోగదారుల రక్షణ – పరిహారం: రుణం తీర్చిన తర్వాత, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తనఖా పెట్టిన ఆభరణాలను 7 పని దినాల్లోపు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఆ గడువులోగా తిరిగి ఇవ్వలేకపోతే, ఆ సంస్థ కస్టమర్‌కు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

డిఫాల్ట్ అయినప్పుడు చర్యలు:

వినియోగదారుడు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే, తనఖా పెట్టిన బంగారం లేదా వెండిని వేలం వేసే హక్కు సంస్థలకు ఉంటుంది. అయితే, వేలం వేయడానికి ముందు వినియోగదారుడికి నోటీసు ఇవ్వాలి. ఒకవేళ వినియోగదారుడిని సంప్రదించడం సాధ్యం కాకపోతే, ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసి, ఒక నెల రోజుల పాటు వేచి ఉన్న తర్వాతనే వేలం ప్రక్రియను ప్రారంభించాలి. మొత్తంగా, బంగారం లాగే వెండిపై కూడా రుణాలు పొందే సదుపాయం చిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది.

Also Read: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..? 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *