పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దాడులు ప్రపంచ దేశాలను వణికించడమే కాకుండా సామాన్య భారతీయుడి బడ్జెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటిన తరుణంలో ఇరాన్‌లోని ధరలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.2 నుండి రూ.5 మధ్యలోనే ఉంటుంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలలో ఒకటి. సొంతంగా భారీ నిల్వలు ఉండటంతో వారు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇరాన్ ప్రభుత్వం తన ప్రజల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధన సబ్సిడీలను అందిస్తోంది. ప్రభుత్వం నష్టాలను భరించి మరీ తక్కువ ధరకు పెట్రోల్‌ను సరఫరా చేస్తుంది.
భారత్‌లో ధరలు ఎందుకు ఎక్కువ?
ఇరాన్‌తో పోలిస్తే మన దేశంలో పరిస్థితి భిన్నం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
దిగుమతులపై ఆధారపడటం: మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. దీనికి షిప్పింగ్ ఖర్చులు, డాలర్ మార్పిడి రేటు అదనంగా తోడవుతాయి.
పన్నుల భారం: ఇరాన్లో సబ్సిడీలు ఉంటే భారత్‌లో పన్నులు ఉన్నాయి. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కలిపితే పెట్రోల్ అసలు ధరపై దాదాపు 40 నుండి 50 శాతం పన్నులే ఉంటున్నాయి.
యుద్ధం ముదిరితే రూ. 110 దాటడం ఖాయమా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇలాగే కొనసాగితే.. చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరుగుతుంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్‌లో పెట్రోల్ ధర రూ.110 దాటినా ఆశ్చర్యం లేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సామాన్యుడిపై చైన్ రియాక్షన్ ప్రభావం:
ఇంధన ధరలు పెరిగితే అది కేవలం వాహనదారులకే పరిమితం కాదు.. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు, పప్పులు, కిరాణా సామాగ్రి వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మొత్తానికి ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న ఈ యుద్ధం, భారతీయుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేసేలా ఉంది.