PV Sindhu : ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్‌లో ఎన్నో సవాలుతో కూడిన మ్యాచ్‌లు ఆడింది.. ఎన్నో రికార్డులు సృష్టించింది. కానీ గత 72 గంటల్లో ఆమె అనుభవించిన నరకం మాత్రం వర్ణనాతీతం. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన సింధు, ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి తిరిగివచ్చింది. ఆ భయంకరమైన రెండు రోజుల అనుభవాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సింధు ఫిబ్రవరి 28న లండన్ బయలుదేరింది. మధ్యలో దుబాయ్ ఎయిర్ పోర్టులో లే-ఓవర్ (విరామం) ఉంది. ఆమె దిగిన కొన్ని నిమిషాలకే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో గగనతలాన్ని అకస్మాత్తుగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటివరకు సాధారణంగానే ఉన్న ఎయిర్ పోర్టు ఒక్కసారిగా యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. విమానాలన్నీ రద్దు కావడంతో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లే క్రమంలో సింధు ఎదుర్కొన్న సంఘటనలు మరింత భయంకరంగా ఉన్నాయి. ఆమె హోటల్ బస్సులో ఉండగా, అప్పుడే ఎయిర్ పోర్టు బయట ఉన్న తన కోచ్ నుంచి మెసేజ్ వచ్చింది. “పెద్ద శబ్దం వినిపించింది.. అంతా పొగ కమ్ముకుంది.. జనం పరుగులు తీస్తున్నారు” అని ఆయన చెప్పడంతో సింధు ప్రాణాలు చేతిలోకి వచ్చాయి. అది బాంబు పేలుడా? డ్రోన్ దాడా? అనేది అర్థం కాక ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపినట్లు సింధు ఆవేదన వ్యక్తం చేసింది. హోటల్ కిటికీల నుంచి ఐదారుసార్లు భారీ శబ్దాలు వినిపించాయని, కిటికీలకు దూరంగా ఉండండి అని ఫోన్లకు అత్యవసర హెచ్చరికలు కూడా వచ్చాయని ఆమె పేర్కొంది.
ఆపత్కాలంలో భారత ప్రభుత్వం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ చేసిన సహాయాన్ని సింధు కొనియాడింది. కేంద్ర క్రీడా మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు నిరంతరం ఆమెతో టచ్‌లో ఉండి ధైర్యం చెప్పారు. కాన్సులేట్ అధికారులు స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి భారతీయులకు ఆహారం, నీరు అందిస్తూ భరోసా ఇచ్చారు. చివరికి లండన్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, ఆల్ ఇంగ్లాండ్ టోర్నీని వదులుకుని ప్రాణాలతో బయటపడటమే ముఖ్యమని సింధు భావించింది.
“ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఆడలేకపోవడం బాధగానే ఉంది. కానీ నా ప్రాణాలతో క్షేమంగా ఇంటికి చేరుకోవడమే నాకు అత్యంత ముఖ్యం” అని సింధు తెలిపింది. యుద్ధం మధ్యలో చిక్కుకుపోవడం ఎవరూ ఊహించని అనుభవమని, తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆమె చెప్పింది. ప్రస్తుతం క్షేమంగా హైదరాబాద్ చేరుకోవడంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..