భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల బయోమెట్రిక్స్‌ను ఉచితంగా అప్డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కార్యక్రమం చేపట్టగా.. ఇప్పటివరకు ఏకంగా లక్షకుపైగా స్కూళ్లల్లో విద్యార్థుల బయోమెట్రిక్స్ వివరాలను అప్డేట్ చేసింది. ఏకంగా ఆరు నెలల్లో ఈ మైలురాయిగా చేరుకోవడం విశేషంగా మారింది. ఈ ఆరు నెలల్లో దాదాపు 1.2 కోట్ల మంది పిల్లలకు ఈ కార్యక్రమం సహాయపడిందని యూఐడీఏఐ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి
7 నుంచి 15 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయడం యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శిబిరాల్లో ఉచితంగానే వివరాలను అప్ డేట్ చేస్తోంది. బయట ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక కేంద్రాల్లో ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ క్యాంపులు ఏకంగా 1,03,000 స్కూళ్లల్లో ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు లక్షలాది మంది ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకున్నారు. విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలను సులభంగా, సౌకర్యవంతంగా అప్ డేట్ చేసుకోవడానికి ఈ సౌకర్యం ఉపయోగపడిందని యూఐడీఏఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ప్రభుత్వ పథకాలకు ప్రయోజనం
విద్యార్థులు చిన్నతనంలో ఆధార్ కార్డు పొంది ఉంటారు. అప్పటి ఆధార్ బయోమెట్రిక్ వివరాల్లో కొద్ది వయస్సు తర్వాత మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఈ క్యాంపుల ద్వారా యూఐడీఏఐ కల్పిస్తోంది. ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు పొందటంతో ఇబ్బంది పడవచ్చు. నీట్, జేఈఈ, జీయూఈటీ వంటి పోటీ, విశ్వవిద్యాలయ పరీక్షల్లో నమోదు చేసుకునేందుకు కూడా ఆధార్ వివరాలు ఉపయోపడతాయి. ఇప్పటివకు దాదాపు దేశంలో 1.2 కోట్ల మంది పిల్లలు ఈ క్యాంపుల ద్వారా ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. కాగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ప్రతీ నెలలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతీ నెలా తొలివారం లేదా చివరి వారంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.