రంగుల పండుగ హోలీ అంటేనే కేరింతలు..చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ జరుపుకునే సంబరం. కానీ, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాత్రం హోలీ పండుగ అంటే కేవలం రంగులే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటేనే అక్కడ పండుగ పూర్తవుతుంది. దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతుంది. వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంటే మిగతా ఊర్ల కంటే కాస్త భిన్నం. రాష్ట్రమంతా ఒకరోజు హోలీ జరుపుకుంటే.. వెల్దుర్తిలో మాత్రం ఒకరోజు ముందే రంగుల వేడుక మొదలవుతుంది. ఉదయం పూట దైవ ప్రార్థనలతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు.. రాత్రి అయ్యేసరికి కొంత పోరాటల నేపధ్యంలోకి మారుతాయి. హోళీ పండుగ రోజు రాత్రి కాగానే గ్రామస్తులంతా ఒక్కచోటికి చేరుకుంటారు. డప్పుల మోతతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఒక పొడవాటి తాడును ఊరంతా తిప్పుతూ హనుమాన్ దేవాలయం వద్దకు చేరుకుంటారు. ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది. గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోతారు.
తాడు విడవకుండా పిడిగుద్దులు..
ఒక చేత్తో పెద్ద తాడును గట్టిగా పట్టుకుని.. మరో చేత్తో ఎదుటి గ్రూపు వారిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఎదుటివారు గుద్దుతున్నా వెనక్కి తగ్గకుండా.. మొండిగా తాడును పట్టుకుని ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తారు ఇక్కడి ప్రజలు. ఈక్రమంలో కొందరికి గాయాలైనా, అస్సలు పట్టించుకోరు. ఇది ఏ ఒక్కరి మీద కోపంతో చేసేది కాదు. ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఆచారం మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు. ఇలా పిడిగుద్దులతో హోలీ జరుపుకుంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని,అందరూ సుఖసంతోషాలతో ఉంటారని వారి నమ్మకం.
వీడియో చూసేయండి..