రంగులు కడగకముందే ఇది చేయండి: చాలామంది చేసే తప్పు ఏమిటంటే.. రంగులు పడగానే నేరుగా నీళ్లతో కడిగేస్తారు. అలా కాకుండా రంగులు అంటుకున్న చోట ముందుగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసి కాసేపు మసాజ్ చేయండి. ఇది రంగును చర్మం నుండి వదులు అయ్యేలా చేస్తుంది.
సబ్బుకు బదులుగా ఉబ్టాన్: మొండి రంగులను వదిలించడానికి గరుకుగా ఉండే సబ్బులను అతిగా వాడకండి. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. దానికి బదులుగా ఈ పిండి మిశ్రమాన్ని ప్రయత్నించండి. శనగపిండి, పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్టులా చేసి రంగులు ఉన్నచోట రాయండి. ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ కడిగేయండి. ఇది సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
గోళ్ల రక్షణ కోసం: గోళ్లలోకి చేరిన రంగులు అంత త్వరగా పోవు. హోలీ ఆడే ముందే గోళ్లకు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిది. ఒకవేళ రంగులు అంటితే ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి, 10 నిమిషాల పాటు వేళ్లను నానబెడితే రంగు సులభంగా పోతుంది.
ముఖంపై రంగుల కోసం క్లెన్సింగ్ మిల్క్: ముఖం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ముఖంపై రంగులను వదిలించడానికి క్లెన్సింగ్ మిల్క్ లేదా మేకప్ రిమూవర్ ఉపయోగించండి. అది లేకపోతే దూదిని కొబ్బరి నూనెలో ముంచి తుడవండి.
జుట్టు విషయంలో జాగ్రత్తలు: జుట్టుకు అంటుకున్న రంగులను వదిలించుకోవడానికి వెంటనే షాంపూ చేయకండి. ముందుగా జుట్టును మామూలు నీళ్లతో బాగా కడగండి. ఆ తర్వాతే మైల్డ్ షాంపూ వాడండి. చివరగా తప్పనిసరిగా కండీషనర్ వాడాలి, లేదంటే రంగుల్లోని కెమికల్స్ వల్ల జుట్టు గడ్డిలా మారుతుంది. వేడి నీళ్లతో రంగులను కడగకండి. వేడి నీరు రంగును చర్మానికి మరింత గట్టిగా అంటుకునేలా చేస్తుంది. ఎప్పుడూ చల్లని లేదా మామూలు నీటినే వాడండి.




