Pakistan Cricket : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. దిగ్గజ అంపైర్ అవుట్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం

Pakistan Cricket : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. దిగ్గజ అంపైర్ అవుట్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం


Pakistan Cricket : పాకిస్థాన్ క్రికెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభం ముదురుతోంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాక్ జట్టు ప్రదర్శన ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సూపర్ 8 దశలోనే ఇంటిముఖం పట్టిన బాబర్ సేనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఆటగాళ్లందరికీ భారీగా జరిమానాలు విధించిన పీసీబీ, ఇప్పుడు బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అంపైర్, దిగ్గజం అలీమ్ దార్ తన సెలక్టర్ పదవికి రాజీనామా చేశారు.

టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన వెంటనే అలీమ్ దార్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2024 అక్టోబర్‌లో ఆయన సెలక్షన్ కమిటీలో చేరారు. అంపైర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అలీమ్ దార్, జట్టు ఎంపికలో కూడా తనదైన ముద్ర వేస్తారని అందరూ భావించారు. కానీ, ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం చెందడంతో ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పీసీబీ ఒత్తిడి మేరకే ఆయనను పదవి నుంచి తొలగించారని కొన్ని పాక్ మీడియా వర్గాల కథనం. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్ మాత్రమే మిగిలారు. త్వరలోనే కొత్త సభ్యులను నియమించేందుకు పీసీబీ కసరత్తు చేస్తోంది.

ఈ టోర్నీలో పాకిస్థాన్ ప్రస్థానం ఆద్యంతం గందరగోళంగా సాగింది. గ్రూప్ స్టేజ్‌లో నెదర్లాండ్స్, నమీబియా, అమెరికాలపై ఎలాగోలా నెగ్గినప్పటికీ.. అసలైన ప్రత్యర్థి భారత్ చేతిలో కొలంబో వేదికగా 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆ పరాజయం పాక్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇక సూపర్-8లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలవ్వడంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై కేవలం 5 పరుగుల తేడాతో నెగ్గినప్పటికీ, నెట్ రన్ రేట్ సరిగా లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత పాక్ జట్టులో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు పడే అవకాశం ఉందని, అలాగే సీనియర్ ఆటగాళ్లను తప్పించి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని బోర్డు యోచిస్తోంది. మరోవైపు, జట్టు కోచింగ్ స్టాఫ్‌ను కూడా మార్చాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భావిస్తున్నారు. పాక్ క్రికెట్ పతనాన్ని అడ్డుకోవాలంటే పాత పద్ధతులను వీడి, జట్టులో క్రమశిక్షణను పెంచాలని మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పాక్ క్రికెట్‌లో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *